
రుతుక్రమ వయస్సులో ఉన్న మహిళలకు శబరిమలలోకి అనుమతించే వివాదాస్పద అంశంపై గతంలో వీధులలో పోరాటాలు చేయడమే కాకుండా, సుప్రీంకోర్టు వరకు వెళ్లి అలజడి సృష్టించిన కేరళలోని వామపక్ష ప్రభుత్వం ఇప్పుడు వెనుకడుగు వేసింది. అది ముగిసిపోయిన అధ్యాయం అంటూ ప్రకటించింది. ఆ అంశాన్ని ఇక వదిలివేశామని, భక్తుల మనోభావాలకు అనువుగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు కేరళలోని పాలక సిపిఎం ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.
శబరిమల ఆచారాలను పరిరక్షిస్తామని, ఈ విషయంపై సుప్రీంకోర్టును ఒప్పించడానికి ప్రయత్నిస్తామని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ వెల్లడించారు. మహిళల ప్రవేశానికి సంబంధించిన పిటిషన్లో న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత కొత్త అఫిడవిట్ను అత్యున్నత న్యాయస్థానంలో సమర్పించాలని బోర్డు యోచిస్తోంది.
అయ్యప్ప ఆచారాలను పరిరక్షిస్తామని దేవస్థానం హామీ ఇస్తే, దానికి సహకరిస్తామని ప్రముఖ సమాజ సంస్థలు ఎన్ఎస్ఎస్, ఎస్ఎన్డీపీలు ప్రకటించాయి. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నందున వీటి మద్దతు పొందడం వీలైనంత వరకు సన్నిహితంగా ఉండాలని వామపక్ష ప్రభుత్వం భావిస్తోంది. సెప్టెంబరు 20న పంబా నది ఒడ్డున ‘గ్లోబల్ అయ్యప్ప సమావేశం’ భారీఎత్తున నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి వి.ఎన్.వాసవన్ ప్రకటించారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దీన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందులో ప్రజా ప్రతినిధులు, ప్రత్యేక ఆహ్వానితులకు మాత్రమే ఇందులో ప్రవేశం ఉంటుంది. కేరళ నుంచి 800మంది, తమిళనాడు నుంచి 500, కర్ణాటక నుంచి 250, తెలుగు రాష్ట్రాల నుంచి 250, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి 200, విధేశాల నుంచి 500 మంది రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తుల ఆలోచనలను స్వీకరించడం, ప్రభుత్వం ఆమోదించిన మాస్టర్ ప్లాన్‌ను వారికి అందించడం, వారి సూచనలు స్వీకరించడం ఈ సమావేశ ప్రాథమిక లక్ష్యాలు. రాబోయే మండలం-మకర విలక్కు సీజన్‌కు దీనిని ఒక ప్రకటనగా మార్చడం కూడా ఈ సమావేశ ముఖ్య ఉద్దేశ్యం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి.గోవిందన్ విలేకరులతో మాట్లాడుతూ ట్రావంకోర్ దేవస్వం బోర్డు(టిడిబి) నిర్వహిస్తున్న ‘గ్లోబల్ అయ్యప్ప సంగమం’ ప్రపంచవ్యాప్త అయ్యప్ప భక్తుల ప్రయోజనాలకు అనుగుణంగానే ఉంటుందని హామీ ఇచ్చారు.
సిపిఎం ఎన్నడూ భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా వైఖరిని చాటలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. “సిపిఎం, ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం రెండూ విశ్వాసులతోనే ఉంది” అంటూ చెప్పుకొచ్చారు. శబరిమల మందిరంను రుతుక్రమంలో ఉన్న మహిళలు సందర్శించే విషయం గురించి విలేకరులు ప్రశ్నించినప్పుడు తాను దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని స్పష్టం చేశారు. దానిపై కోర్టు తీర్పు ప్రకారం నడుచుకుంటామని ప్రకటించారు.
“శబరిమల విధివిధానాలు, పూజాపునస్కారాల గురించి అందరికీ తెలుసు. సుప్రీంకోర్టును ఈ విషయంలో ఒప్పిస్తాం” అంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా ట్రావంకోర్ దేవస్వం బోర్డు తన 75వ వార్షికోత్సవంలో భాగంగా, కేరళ ప్రభుత్వంతో కలిసి సెప్టెంబర్ 20న పంపాలో ‘ప్రపంచ అయ్యప్ప సంగమం’ నిర్వహించబోతున్నది.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం