ఆఫ్ఘన్ కు అత్యవసర మానవతా సాయాన్ని అందిస్తోన్న భారత్

ఆఫ్ఘన్ కు అత్యవసర మానవతా సాయాన్ని అందిస్తోన్న భారత్
* 1400కు దాటిన మృతుల సంఖ్య

అఫ్గానిస్థాన్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 1400 దాటింది. మరో 3,000 మందికి పైగా గాయపడ్డారు. 6.0 తీవ్రతతో సంభవించిన భూకంప తాకిడికి గ్రామాలకు గ్రామాలే ధ్వంసమయ్యాయి. తాలిబన్‌ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.  వేల సంఖ్యలో ప్రజలు ఇంకా శిథిలాల కిందే చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు.

మరోవైపు భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, అన్ని రకాలుగా సాయం చేస్తామని హామి ఇచ్చారు. అప్గానిస్థాన్ భూకంప బాధితులను ఆదుకునేందుకు భారత్ అత్యవసర మానవతా సాయాన్ని పంపించింది. పర్వత ప్రాంతమైన తూర్పు అఫ్గానిస్థాన్‌లో భూకంపం తాకాయి. మారుమూల గ్రామాల్లో ఇంకా సహాయక చర్యలు ప్రారంభం కాలేదు. చాలా ప్రాంతాల్లో ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. శిథిలాల కింద అనేకమంది ఇంకా సజీవంగా ఉన్నారని అనుమానిస్తున్నారు.

శిథిలాల కింద చిక్కుకున్న ఆప్తులను రక్షించుకొనేందుకు చేతులతోనే చాలా మంది మట్టిని తవ్వితీస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. సాయం అందడంలో జరుగుతున్న జాప్యం కారణంగా వీరంతా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. రాత్రంతా పలుమార్లు భూమి కంపిస్తూనే ఉందని తెలిపారు. పాకిస్థాన్‌లోనూ పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.

ఇప్పటికే మానవతా సాయాన్ని భూకంప ప్రభావిత ప్రాంతాలకు పంపించడం ప్రారంభించామని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ చెప్పారు.  అందులో బియ్యం, ఇతర ఆహార పదార్ధాలు ఉన్నాయి. అంతకుముందు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, ఆప్ఘానిస్థాన్ విదేశాంగ మంత్రి మౌలావి అమీర్ ఖాన్ ముత్తాకో మాట్లాడారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

 
కాబుల్కు భారత్ 1000 కుటుంబాలకు సరిపడ టెంట్లను పంపించిందని పేర్కొన్నారు. 15 టన్నుల ఆహార సామగ్రిని పంపించందని తెలిపారు. మరింత సహాయ సామగ్రిని పంపుతామని హామీ ఇచ్చారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కష్ట సమయంలో ఆప్ఘానిస్థాన్కు భారత్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.