
* ఏపీ బీజేపీ అధ్యక్షుడిని కోరిన విశ్వహిందూ పరిషత్
ఆంధ్ర ప్రదేశ్ లోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బిజెపి రాష్ట్రంలోని దేవాలయాలు అన్నింటిని ప్రభుత్వం నుండి విముక్తి చేసి హిందూ సమాజంకు అప్పగించే విధంగా బిజెపి చొరవ చూపాలని విశ్వహిందూ పరిషత్ కోరింది. రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ను బిజెపి కేంద్రీయ సంఘటన కార్యదర్శి మీలాండ్ పరాండే, క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవి కుమార్ లతో కూడిన ప్రతినిధివర్గం కలిసి వినతిపత్రం సమర్పించింది.
ఈ ఏడాది విజయవాడలో జరిగిన హైందవ శంఖారావం లో తీసుకున్న నిర్ణయాలను, అదేవిధంగా ఇటీవల జరిగిన సంఘటనలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. బ్రిటిష్ పరిపాలన సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం హిందూ సమాజాన్ని నియంత్రించాలంటే వారి దేవాలయాలను నియంత్రణలోకి తీసుకోవాలనే కుతంత్రంలో భాగంగా దేవాలయాలను తమ ఆధీనంలోకి తీసుకొన్నారని వారు తెలిపారు.
స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే పద్ధతిని దేవదాయ ధర్మదాయ శాఖ ద్వార మన ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. హిందువుల అజమాయిషీ నుంచి ప్రభుత్వ అధికారుల నియంత్రణ లోకి వెళ్లిన కారణంగా సరైన దిశలో (ఆదర్శ దిశలో) దేవాలయాల నిర్వహణ లేవని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ‘మందిరాల విముక్తికై’ గత జనవరి 5న విజయవాడలో జరిగిన ‘హైందవ శంఖారావం’ బహిరంగ సభలో రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాదిగా ప్రజలు ఈ సభలో స్వచ్ఛందంగా పాల్గొని మందిరాలు విముక్తి జరగాలని తమ మనోగతాన్ని ప్రకటించారని గుర్తుచేశారు. హిందూ సమాజం కూడా మందిరాలను తీసుకోవడానికి సంసిద్ధమవుతోందని వారు తెలిపారు.
దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వము ఎండోమెంట్ చట్టాన్ని మార్చి హిందూ సమాజానికి దేవాలయాల్ని అప్పగించడానికి తగిన ప్రయత్నం చేయాలని వారు డిమాండ్ చేశారు. విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల నియంత్రణ నుండి మందిరాలు విముక్తి జరగాలని చాలా కాలంగా ఉద్యమిస్తూ ఉన్నదని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఈ విషయంలో కలిసి వివరిస్తున్నదని వారు వివరించారు.
బిజెపి నేతృత్వంలో మందిరాలు విముక్తి చేసి అన్ని రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును అగ్రగామిగాను, ఆదర్శంగాను నిలపాలని వారు మాధవ్ ను కోరారు. ఇందుకోసం విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేసిందని చెప్తూ దాని ప్రతిని అందజేశారు. దీనిని పరిశీలించి ‘మందిరాలు విముక్తి’ జరిగే విధంగా, దేవాలయాలను హిందూ సమాజానికి అప్పగించడానికి బిజెపి చొరవ చూపాలని కోరారు.
More Stories
వైసీపీ అవినీతి పాలనకు బాబు, మోదీ చరమగీతం
2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ సిద్ధం
విశాఖ ఉక్కుపై వామపక్ష పార్టీల దుష్ప్రచారం నమ్మవద్దు