
ఉద్యోగంలో కొనసాగేందుకు లేదా పాఠశాలల్లో పదోన్నతి కోరేందుకు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్టు(టెట్)లో ఉత్తీర్ణులు కావడం ఉపాధ్యాయులకు తప్పనిసరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలోని పాఠశాలల్లో విద్యార్హతలు గల టీచర్ల ఆవశ్యకతను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జి మాసిహ్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది.
పదవీ విరమణకు ముందు ఐదేళ్లకు పైగా సర్వీసు మిగిలి ఉన్న టీచర్లు సర్వీసులో కొనసాగాలంటే తప్పనిసరిగా టెట్ పాస్ కావలసి ఉంటుందని సుప్రీంకోర్టు ఆదేశించింది. టెట్ రాయడానికి ఇష్టపడని ఉపాధ్యాయులు లేక అర్హత సాధించలేకపోయిన ఉపాధ్యాయులు రిటైర్మెంట్ ప్రయోజనాలతో రాజీనామా చేయాలని లేదా కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకోవాలని తెలిపింది.
అయితే పదవీ విరమణకు ముందు ఐదేళ్ల లోపు సర్వీసు ఉన్న వారు మాత్రం టెట్ లేకుండానే సర్వీసులో కొనసాగడానికి ధర్మాసనం అనుమతి ఇచ్చింది. కాగా, రాష్ర్టాలలోని మైనారిటీ విద్యా సంస్థలలో పనిచేస్తున్న టీచర్లకు టెట్ అవసరమా, దాని వల్ల వారి రాజ్యాంగపరమైన హక్కులపై పర్యవసనాలు ఎలా ఉంటాయి అన్న అంశాలను విచారించే విషయాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.
తమిళనాడు, మహారాష్ట్రలోని పాఠశాలల్లో బోధించడానికి టెట్ అవసరమా అన్న అంశానికి సంబంధించిన పిటిషన్పై కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఉపాధ్యాయుల పదోన్నతులకు కూడా టెట్ తప్పనిసరి అని కోర్టు స్పష్టంచేసింది. టెట్ లేకుండా పదోన్నతులు పొందిన వారు రెండేండ్లలోపు టెట్ను క్లియర్ చేయాలని తీర్పునిచ్చింది. ఈ గడువులోపు టెట్ అర్హత సాధించకపోతే ఉద్యోగాన్ని వదులుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేసింది.
సుప్రీం కోర్టు తీర్పు దేశమంతటా వర్తిస్తుంది. రాష్ట్రంలో 2012 నుంచి టెట్ అమల్లో ఉంది. 2012, 2017, 2024లో రిక్రూట్ అయిన వారంతా టెట్ అర్హత గల వారే. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23(1) ప్రకారం టీచర్ల విద్యార్హతలను ఎన్సీటీఈ నిర్ధారిస్తుంది. 1 నుంచి 8వ తరగతి వరకు టీచర్లుగా పనిచేయాలంటే టెట్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టు 23న ఎన్సీటీఈ ఓ నోటిఫికేషన్ జారీచేసింది.
టీచర్లుగా నియమితులైనవారు ఐదేళ్ల లోపు టెట్లో ఉత్తీర్ణులు కావాలని ఎన్సీటీఈ సమయం ఇచ్చింది. అయితే తర్వాత ఈ గడువును మరో నాలుగేళ్లకు పొడిగించింది. కాగా, ఎన్సీటీఈ నోటిఫికేషన్ని సవాలు చేస్తూ కొందరు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. 2011 జూలై 29 లోపల టీచర్లుగా నియమితులైన అభ్యర్థులు సర్వీసులో కొనసాగడానికి టెట్ అవసరం లేదని మద్రాసు హైకోర్టు 2025 జూన్లో తీర్పు ఇచ్చింది.
అయితే పదోన్నతి కోసం టెట్ పాసు కావడం తప్పనిసరని స్పష్టం చేసింది. దీనిపై దాఖలైన అప్పీలుపై సోమవారం తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు సర్వీసులో కొనసాగడంతోపాటు ప్రమోషన్ పొందేందుకు కూడా టెట్ తప్పనిసరని స్పష్టం చేసింది.
More Stories
ప్రకృతితో సమతుల్యతతో జీవించడమే ఆయుర్వేదం
ఆసియాకప్లో హద్దుమీరిన పాక్ ఆటగాళ్లు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవంకు ముఖ్యఅతిధిగా మాజీ రాష్ట్రపతి