
ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా చమురు కొనుగోలులో భారత్ ఎలాంటి నియమాలను ఉల్లంఘించలేదని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. ప్రపంచ చమురు మార్కెట్ను స్థిరంగా ఉంచడంలో ధరలను నియంత్రించడంలో భారత ఇంధన వాణిజ్య విధానం సహాయపడిందని తెలిపారు. వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో చేసిన ‘ల్రాండోమాట్’ వ్యాఖ్యలను కొట్టిపారవేస్తూ ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడికి చాలా కాలం ముందు నుంచే భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి దేశంగా ఉందని గుర్తు చేశారు.
లాండ్రోమాట్ అంటే అనుమానాస్పద వస్తువులను చట్టబద్ధంగా కనిపించేలా చేసే ప్రక్రియ లేదంటే ప్రదేశం అని అర్థం. యుద్ధం తర్వాత కూడా భారత్ ఎగుమతులు, లాభాలు దాదాపు అలాగే ఉన్నాయని తెలిపారు. భారత్ అన్ని అంతర్జాతీయ నిబంధనలను పూర్తిగా గౌరవించడం వల్లే చమరు బ్యారెల్ ధర 200 డాలర్లకు చేరకుండా చూసిందని చెప్పారు. ప్రస్తుతం భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా 37 శాతంగా ఉంది.
పీటర్ నోవారో గత వారంలో ఉక్రెయిన్ యుద్ధాన్ని ‘మోదీ యుద్ధం’గా అభివర్ణించారు. భారత్ రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ‘యుద్ధ యంత్రం’కి నిధులు సమకూరుస్తోందని ఆరోపించారు. ఇరాన్, వెనిజులా లాగా రష్యన్ చమురుపై ప్రత్యక్ష నిషేధం లేదని పూరి పేర్కొన్నారు. జి-7, యూరోపియన్ యూనియన్ రష్యన్ చమురుపై ధరల పరిమితి వ్యవస్థను విధించాయని, ఇది చమురు సరఫరాను కొనసాగించడం, రష్యా ఆదాయాన్ని పరిమితం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
భారత్ ప్రతి లావాదేవీలు చట్టబద్ధమైనవని స్పష్టం చేశారు. భారత్ చట్టబద్ధమైన షిప్పింగ్, భీమా, సర్టిఫైడ్ వ్యాపారులు, పరీక్షించిన మార్గాల ద్వారా మాత్రమే వ్యాపారం చేసిందని చెప్పారు. బ్రోకరేజ్ సంస్థ సిఎల్ఎస్ఏ ఇటీవల ఇచ్చిన నివేదికను ఉటంకిస్తూ.. భారత్ రష్యన్ చమురు దిగుమతిని ఆపివేస్తే ముడి చమురు ధరలు బ్యారెల్కు 90 నుంచి 100 డాలర్లకు చేరుకోవచ్చని పూరి తెలిపారు. రష్యన్ చమురు కొనుగోలుదారులు పరిమితంగా ఉన్నందున, భారత్ ఉపసంహరించుకోవడం వల్ల ప్రపంచ సరఫరా ఒక శాతం తగ్గవచ్చని, ఇది ధరలు, ద్రవ్యోల్బణం రెండింటినీ పెంచుతుందని ఆయన హెచ్చరించారు.
భారతదేశ ఎగుమతి, శుద్ధి మార్జిన్లలో పెద్ద మార్పు లేదని.. కాబట్టి లాభాల ప్రశ్నే తలెత్తలేదని పేర్కొంటూ ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ ధరలు పెరిగిన సమయంలో భారత్ తన పౌరులకు ఉపశమనం కలిగించడానికి అనేక చర్యలు తీసుకుందని పూరీ స్పష్టం చేశారు.
More Stories
స్వదేశీ ఉత్పత్తులే కొనండి, అమ్మండి, వినియోగించండి
నవంబర్ 5 నుంచి 15 వరకు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు!
ఎల్టీటీఈ పునరుద్ధరణకు శ్రీలంక మహిళ ప్రయత్నం