
భారత్ పై అమెరికా విధిస్తున్న సుంకాలను ప్రస్తావిస్తూ ఇతరుల ఆర్థికస్వార్థం వల్ల ఎన్ని సవాళ్లు ఎదురైనా భారత్ 7.8 శాతం వృద్ధిరేటు సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశ ఆర్థికవ్యవస్థ అంచనాలను మించి రాణిస్తోందని తెలిపారు. ఢిల్లీలోని బశోభూమిలో నిర్వహించిన ‘సెమీకాన్ ఇండియా 2025’ సదస్సులో మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ మాత్రం స్థిరంగా అభివృద్ధి వైపు ముందడుగు వేస్తోందని గుర్తు చేశారు. సెమి కండక్టర్ రంగాన్ని ఆలస్యంగా ప్రారభించిన భారత్‌ను, ఏ దేశం ఆపలేకపోతుందని పేర్కొన్నారు.
“సదస్సులో 40 దేశాల ప్రతినిధులు పాల్గొనడం సంతోషకరం. భారత్ ఆవిష్కరణలు, యువ శక్తి కూడా సదస్సులో ఉంది. ప్రపంచ దేశాలకు భారత్‌పై నమ్మకం పెరిగింది. పోటీ పెరిగిన తరుణంలోనూ భారత్‌కు ఆదరణ తగ్గలేదు. సెమీ కండక్టర్ల రంగంలో ప్రపంచ దేశాలు భారత్‌తో కలిసి వస్తున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ యాత్రలో దేశానికి కీలక భాగస్వాములున్నారు” అని ప్రధాని తెలిపారు.
నేడు సెమి కండక్టర్ ప్రపంచ మార్కెట్ విలువ 600బిలియన్ డాలర్లకు చేరిందని, రాబోయే కొన్నేళ్లలో ట్రిలియన్ డాలర్లను అధిగమించనుందని చెబుతూ భారత్ వేగంగా సెమికండక్టర్ రంగంలో ముందుకు సాగుతున్నతీరు చూస్తే ట్రిలియన్ డాలర్ల మార్కెట్ షేర్‌లో భారత్ వాటా ఎక్కువగా ఉండనుందనే నమ్మకం ఉందని ప్రధాని స్పష్టం చేశారు.
ప్రపంచంలోని వివిధ కంపెనీలు మేకిన్ ఇండియా కోసం భారత్‌కు రావాలని, ప్రపంచం కోసం తయారీలు చేపట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు.
తమ ప్రభుత్వ పాలనలో భారత్‌లో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం, విధానాల్లో పారదర్శకత లాంటి పలు మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ త్వరలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించనుందని ప్రధాని విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ వృద్ధి కేవలం ఒకే రంగానికి పరిమితం కాకుండా అన్నిరంగాల్లో కనిపిస్తోందని చెప్పారు.
తాము మేడిన్ ఇండియా ఉత్పత్తులను వినియోగిస్తున్నామని ప్రపంచదేశాలు చెప్పుకునే రోజు త్వరలోనే రానుందని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు. సెమీకాన్ ఇండియా 2025 సదస్సులో 40 దేశాల ప్రతినిధులు పాల్గొనడంపై సంతోషం వ్యక్తంచేశారు. ప్రపంచ దేశాలకు భారత్ పట్ల నమ్మకం పెరిగిందనడానికి ఇదే ఉదాహరణ అని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరిగిన తరుణంలోనూ భారత్‌కు ఆదరణ తగ్గలేదని చెప్పారు. భారత్‌పై అమెరికా భారీగా పన్నులు విధిస్తున్న నేపథ్యంలో మోదీ మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయని తెలిపారు.
ఇక డిల్లీలో సెమీకాన్ ఇండియా సదస్సు-2025లో కేంద్ర మంత్రి అశ్వీనీ వైష్ణవ్ తొలి ‘మేకిన్ ఇండియా మైక్రో ప్రాసెసర్ చిప్’లను ప్రధాని మోదీకి అందించారు. విక్రమ్ 32 బిట్ ప్రాసెసర్, టెస్ట్ చిప్స్‌ను ఇస్రో సెమీకండక్టర్ ల్యాబ్ అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఐదు సెమీకండక్టర్ యూనిట్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు.
More Stories
భారత్ లక్ష్యంగా కొత్త చట్టానికి ట్రంప్ ప్రతిపాదన
అభద్రతా భావంతోనే అమెరికా సుంకాలు
40 ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ.2,532 కోట్లు