ఆఫ్ఘనిస్థాన్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటాం

ఆఫ్ఘనిస్థాన్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటాం
ఆఫ్ఘనిస్థాన్‌ లో భారీ భూకంపం సంభవించి 800 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్తులో కుటుంబసభ్యులను, సన్నిహితులను కోల్పోయిన వారికి తగిన శక్తినివ్వాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. భూకంపం ధాటికి తీవ్రంగా నష్టపోయిన ఆఫ్ఘనిస్థాన్‌కు అన్ని రకాల మనవతా సాయం అందించి, ఆ దేశాన్ని ఆదుకునేందుకు భారత్‌ సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని ప్రకటించారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. ఆ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.0 గా నమోదైంది. ఈ ఘోర విపత్తు ధాటికి 800 మందికి పైగా మరణించినట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ ‘రేడియో టెలివిజన్‌ ఆఫ్ఘనిస్థాన్‌’ వెల్లడించింది.  మరో 3000 మంది వరకు గాయపడినట్లు తెలిపింది. ఆదివారం అర్ధరాత్రి 11.47 గంటల సమయంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా పలు గ్రామాల్లోని ఇళ్లు పూర్తిగా నేలమట్టమైనట్లు వార్దక్‌ ప్రావిన్స్‌ మాజీ మేయర్‌ జరీఫా ఘఫ్పారీ చెప్పారు. 
 
బాధితుల పరిస్థితి దుర్భరంగా ఉందని, అసమర్థ తాలిబన్‌ ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టలేదని అన్నారు. ఈ ఆపద సమయంలో అంతర్జాతీయ సమాజం, మానవతా సంస్థలు సత్వరమే స్పందించి బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో పర్వత శ్రేణుల్లో ఉన్న గ్రామాలు అక్కడక్కడ ఉన్నాయి. భూకంపంతో కమ్యునికేష్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. తమ కళ్ల ముందే ఇళ్లు కూలిపోవడంతో ఇళ్లలో నిద్రపోతున్న పిల్లలు చనిపోయారని, శిథిలాలకింద చిక్కుకు పోయిన జనం భయంతో కేకలు పెట్టారని బయటపడిన ఓ వ్యక్తి తెలిపారు. పెద్దఎత్తున సహాయ కార్యక్రమాలు మొదలయ్యాయి.
 
శిథిలాల కింద చిక్కుకున్న వారందరినీ రక్షించేందుకు కృషి చేస్తున్నారు. కునార్, సంగర్హార్, రాజధాని కాబూల్ నుంచి వైద్య బృందాలు ఆ ప్రాంతానికి చేరుకుని అత్యవసర చికిత్సలు అందిస్తున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. 2023 అక్టోబర్ 7న ఆఫ్ఘనిస్తాన్ లో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపంలో కనీసం 4,000 మంది చనిపోయినట్లు తాలిబన్ ప్రభుత్వం అంచనా వేసింది.