
ఎంపిల అలవెన్సుల పెంపుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చెలరేగిన నిరసనలకు ఇండోనేషియా ప్రభుత్వం దిగివచ్చింది. పార్లమెంటేరియన్లకు అలవెన్సులు, అధికారాలను రద్దు చేయడానికి అంగీకరించినట్లు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో తెలిపారు. పార్లమెంట్ సభ్యుల అలవెన్సు పెంపు, విదేశీ పని పర్యటనలపై తాత్కాలిక నిషేధం వంటి పలు అంశాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం, వ్యక్తుల నివాసాలను, ఆర్థిక కేంద్రాలను దోచుకోవడం వంటి వాటిపై కఠినచర్యలు తీసుకోవాలని సైన్యం, పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. కొన్ని చర్యలు ”దేశద్రోహం”, ”ఉగ్రవాదం”లను సూచిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆగ్నేయాసియా దేశాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం ఇండోనేషియా. గత అక్టోబర్‌లో అధికారం చేపట్టిన ప్రబోవో సబియాంటో ఆర్థికవ్యవస్థ కుదేలయిందని ప్రకటించారు.
పేదల సంక్షేమానికి కోత పెడుతూ, మరోవైపు 580మంది పార్లమెంట్ సభ్యుల గృహ అలవెన్సులను 50 లక్షల రూపియాలకు (రూ.35,000లకు) పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఎంపిలు తీసుకుంటున్న నెలవారీ జీతం కోటి రూపాయలకు ఇది అదనం. సామాన్య పౌరుడి సగటు ఆదాయం కన్నా ఎంపిల గృహ అలవెన్సు 20 రెట్లు ఎక్కువ. ప్రభుత్వ ప్రకటనకు వ్యతిరేకంగా విద్యార్థులు, పౌర సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సోమవారం చేపట్టిన ఆందోళనలు గురువారం వరకు కొనసాగాయి.
అయితే గురువారం నిరసన స్థలంలో పోలీసుల కాల్పుల్లో మోటార్ సైకిల్ రైడ్‌షేర్ డ్రైవర్ మరణించడంతో ఆందోళన హింసాత్మకంగా మారింది. నిరసనకారులు కొంతమంది రాజకీయ నేతల ఇళ్లు, ప్రభుత్వ సంస్థలకు నిప్పు పెట్టడంతో పాటు దోచుకున్నారు. నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్లకు భారత్ హెచ్చరిక