
కాళేశ్వరంపై దాదాపు తొమ్మిదిన్నర గంటల పాటు సభలో సుదీర్ఘమైన చర్చలు, వాదనలు జరిగాయి. నిర్మాణంలో అంతర్రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ భాగస్వామ్యమై ఉన్నాయని, అందుకే కేసును సీబీఐకి అప్పగించడం సముచితమని శాసనసభ భావిస్తోందని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఊరు, పేరు, అంచనాలు మార్చి డబ్బులు దోచుకున్న వారిని శిక్షించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
అంతకుముందు సభలో మాట్లాడిన సీఎం రేవంత్ నాటి బీఆర్ఎస్ పెద్దలు వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చి రాష్ట్రానికి గుదిబండగా మార్చిన కేసీఆర్, హరీశ్ రావును శిక్షించాల్సిన అవసరం లేదా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ కూలిపోవడంతో గోదావరిలో రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయాయన్న సీఎం రేవంత్, కమిషన్ నివేదికలో ఏమైనా లోపాలుంటే వాటిని ప్రస్తావించకుండా జస్టిస్ పీసీ ఘోష్‌ను తక్కువ చేసి మాట్లాడటం ఏ రకంగా సరికాదని మండిపడ్డారు. అధిక వడ్డీలు తెచ్చి రాష్ట్రంపై మోయలేని భారం మోపారని ఆరోపించారు.
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే నిర్మాణ వ్యయం, లిఫ్టులు, నిర్వహణ భారం తగ్గేవన్న రేవంత్ రెడ్డి, అక్కడ ప్రాజెక్టుకు వాప్కోస్ పచ్చజెండా ఊపిందని గుర్తు చేశారు. 2015లో రీడిజైన్ పేరిట కేసీఆర్ మదిలో పడిన బీజం విషవృక్షమై తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. వాస్తవాలను బయట పెట్టారనే హరీశ్ రావు అక్కసు వెళ్లగక్కుతున్నారని సీఎం తప్పుపట్టారు. ఆదివారం అర్ధరాత్రి దాటాకా సాగిన సభ, సీఎం ప్రకటన అనంతరం నిరవధికంగా వాయిదా పడింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లను లూటీ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు తాము హామీ ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అందుకు అనుగుణంగానే దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, తాము ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు నెలల్లోనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించామని తెలిపారు.
ఎన్‌డీఎస్‌ఏ తాత్కాలిక, తుది నివేదికలు విజిలెన్స్ ప్రాథమిక, తుది నివేదికలతోపాటు కాగ్ నివేదికలను జస్టిస్ ఘోష్ కమిషన్‌కు ప్రభుత్వానికి సమర్పించిందన్న రేవంత్ రెడ్డి వాటి ఆధారంగానే కమిషన్ విచారణ జరిపిందని పేర్కొన్నారు. అయితే జస్టిస్ ఘోష్ కమిషన్ తమకు 8బీ, 8సీ నోటీసులు ఇవ్వలేదని అందుకే కమిషన్ రిపోర్టు చెల్లదని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించారన్నారు.
కాగా, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ వేసిన ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఒక వేస్ట్ పేపర్ అని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ఘోష్ కమిషన్ తమ హక్కులను కాలరాసిందని, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్టు 1952 ప్రకారం 8బీ కింద తమకు నోటీసులుగాని, క్రాస్ ఎగ్జామినేషన్‌కు అవకాశం గాని ఇవ్వలేదని, నిబంధనలు పాటించకుండా చేసిన విచారణ ఎట్లా చట్టబద్ధమవుతుందని ప్రశ్నించారు.
అందుకే ఈ విచారణ అన్యాయమైనదని, అశాస్త్రీయమైనదని, రాజకీయంగా ప్రేరేపితమైనది విమర్శించారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అధికార పక్షం తమ గొంతు నొక్కుతోందని, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని వారు ఆరోపించారు.
దీనికి నిరసనగా వాకౌట్ చేసి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు, తమ శాసనసభాపక్ష కార్యాలయంలో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన తర్వాత, బీఆర్ఎస్ నాయకులు గన్ పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడానికి సిద్ధమయ్యారు.
More Stories
టీచర్లుగా కొనసాగాలంటే టెట్ తప్పనిసరి
సీబీఐ విచారణ చేయాలని కేంద్ర హోంశాఖను కోరిన తెలంగాణ
కాళేశ్వరంలో హరీష్ రావు, సంతోష్ రావులది కీలకపాత్ర