
తెలంగాణ రాష్ట్రం గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో కురిసిన కుంభవృష్టి వర్షాలు ప్రజలను చిగురుటాకులా వణికించాయి. పట్టణంలోని వందలాది కాలనీలు నీటమునిగిపోయి. ప్రజలు దాదాపు రెండు రోజులు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఎన్జీవో, జీఆర్ కాలనీల్లో 12 అడుగుల ఎత్తుతో వరద ప్రవాహం కొనసాగి భవనాల గ్రౌండ్ ఫ్లోర్లు పూర్తిగా మునిగిపోయాయి.
కామారెడ్డి పెద్ద చెరువు ఎన్నడూ లేని విధంగా అలుగులు దూకి పరిసర గ్రామాలను భయభ్రాంతులకు గురిచేసింది. ఎగువ మెదక్ జిల్లాలోని అటవీ ప్రాంతాల నుంచి వచ్చిన వరద కూడా పంట పొలాలను ముంచి నష్టాన్ని మరింత పెంచింది. జిల్లా వ్యాప్తంగా 36కు పైగా చెరువులు తెగిపోగా మరో 50 వరకు చెరువులు ప్రమాద స్థితిలో ఉన్నాయని ఇరిగేషన్ శాఖ వెల్లడించింది. మంజీరా నది ఉగ్రరూపం దాల్చి.. నిజాంసాగర్ గేట్లు ఎత్తి లక్షన్నర క్యూసెక్కుల నీరు వదిలేయడంతో అనేక గ్రామాలు వరద ముంపును ఎదుర్కొన్నాయి.
ఇంతటి నష్టాన్ని మిగిల్చిన వర్షం ప్రస్తుతం శాంతించింది. మళ్లీ మరో రెండు రోజుల తర్వాత కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇలాంటి సంక్షోభ సమయంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు తమ రాష్ట్ర ప్రజలకు అండగా నిలిచారు. భారతీయ జనతా పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్రంలోని ఇద్దరు కేంద్ర మంత్రులతో సహా ఎనిమిది మంది ఎంపీలు తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఒక్కొక్కరు రూ. 10 లక్షల చొప్పున కేటాయించడం ద్వారా ప్రజల పక్షాన నిలబడ్డారు.
విపత్కర పరిస్థితుల్లో ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం చూపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిన సందర్భంలో, బిజెపి ఎంపీలు తక్షణమే ముందుకు వచ్చి సహాయక చర్యల కోసం నిధులను కేటాయించడం గమనార్హం. ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు విపత్కర పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడి సహకారం అందించిన బిజెపి ఎంపీలు, కేంద్రమంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడల్లా బిజెపి ముందుండి తోడ్పడుతుందని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రజా హితం కోసం పనిచేస్తుందని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడేది బిజెపి మాత్రమే అన్నది మరోసారి రుజువైందని రాంచందర్ రావు స్పష్టం చేశారు. ప్రజల కష్టాల్లో తోడుగా ఉండటం, సహాయక చర్యల్లో పాల్గొనడం భారతీయ జనతా పార్టీ కర్తవ్యబాధ్యత అని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం తమ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి