దేశాల మధ్య శాశ్వత మిత్రత్వం, శత్రుత్వం అంటూ ఏమీ ఉండదని, అలాగే శాశ్వత మిత్రులు కానీ, శత్రువులు కానీ ఉండరని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. కేవలం ఆ దేశానికి ఉపయోగపడే శాశ్వత ప్రయోజనాలే ఉంటాయని ఆయన తెలిపారు. అలాగే రణరంగంలో ఆత్మ నిర్భరత సాధించడం అత్యావశ్యకమని ఓ జాతీయ మీడియా సదస్సులో పాల్గొంటూ చెప్పారు.
“ప్రపంచం వేగంగా మారుతోంది. అదే సమయంలో కొత్త సవాళ్లు పుట్టుకొస్తున్నాయి. మహమ్మారులు ఉగ్రవాదం, ప్రాంతీయ ఘర్షణలు వంటి వాటితో ఈ శతాబ్దం అత్యంత సవాలుతో కూడి ఉందని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో మన వ్యూహాత్మక అవసరాల దృష్టా ఆత్మ నిర్భరత అనేది అత్యావశ్యకం” అని తెలిపారు.
“మనకు శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి. భారత్ ఎవరినీ శత్రువుగా పరిగణించదు. మన రైతులు, వ్యాపారవేత్తల ప్రయోజనాలే మనకు ముఖ్యం. ప్రస్తుతం మారుతున్న భౌగోళిక, రాజకీయాల కారణంగా రక్షణ పరంగా విదేశాలపై ఆధారపడటం సరైన ఎంపిక కాదని స్పష్టమవుతోంది” అని చెప్పారు.
“స్వావలంబన్ అనేది మన ఆర్థిక వ్యవస్థకు, భద్రతకు అత్యవసరం. 2014లో మనరక్షణ రంగం ఎగుమతుల విలువ రూ.700 కోట్లు. ఇప్పుడది రూ.24 వేల కోట్లకు చేరింది. ఈ గణాంకాలు చూస్తుంటే భారత్ ఒక కొనుగోలు దారుగానే మిగలకుండా ఎగుమతిదారుగా మారుతుందని వెల్లడవుతోంది” అని గుర్తు చేశారు. “ఇక మన బలగాలు స్వదేశీ పరికరాలతో లక్షాలపై కచ్చితత్వంతో చేసిన దాడులు దూరదృష్టి, సమన్వయానికి నిదర్శనం. అలాంటి సన్నద్ధత లేకపోతే ఏ మిషన్ విజయవంతం కాదు” అని రక్షణ మంత్రి పేర్కొన్నారు.

More Stories
ధర్మధ్వజం భారతీయ సాంస్కృతిక పునర్వికాసానికి చిహ్నం
మతం కోసం ఎలా జీవించాలో చూపించిన గురు తేజ్ బహదూర్
లొంగుబాటుకు సమయం కోరిన మావోయిస్టులు