పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో చైనాతో సంబంధాలు

పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో చైనాతో సంబంధాలు
 
* డ్రాగన్, ఏనుగులకు కలిసి రావడం, స్నేహితులుగా ఉండటం చాలా ముఖ్యం
పరస్పర విధాశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు ముందుకు తీసుకెళ్లడానికి భారత్​ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​కు స్పష్టం చేశారు. సరిహద్దు నిర్వహణపై కూడా భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం ఉందని మోదీ స్పష్టం చేశారు.  గతేడాది కజాన్​లో జరిగిన చర్చల తర్వాత భారత్​, చైనా సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం నెలకొంది అని పేర్కొన్నారు. 
గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్​-చైనా ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించడానికి ఇరువురు నేతలు విస్తృత చర్చలు జరిపిన సందర్భంగా ప్రధాని మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. తరువాత షాంఘై సహకారం సంస్థ (ఎస్​సీఓ)కు చైనా విజయవంతంగా అధ్యక్షత వహించినందుకు జిన్​పింగ్​కు అభినందనలు తెలిపారు. 
ప్రధాని మోదీతో ప్రతినిధి బృందం స్థాయి చర్చల సందర్భంగా అధ్యక్షుడు జిన్‌పింగ్ తన ప్రారంభ వ్యాఖ్యలలో, “ప్రపంచం పరివర్తన వైపు పయనిస్తోంది. చైనా, భారతదేశం రెండు అత్యంత నాగరిక దేశాలు. మనం ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన రెండు దేశాలు, గ్లోబల్ సౌత్‌లో భాగం… స్నేహితులుగా ఉండటం, మంచి పొరుగువారిగా ఉండటం, డ్రాగన్ మరియు ఏనుగు కలిసి రావడం చాలా ముఖ్యం…” అని తెలిపారు.
 
“రెండు దేశాల సంబంధాలు పాజిటివ్‌ డైరెక్షన్‌లో వెళ్తున్నాయి. భారత్‌-చైనా సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం నెలకొంది. ఇటీవలే కైలాశ్‌ మానసరవోర్‌ యాత్ర కూడా పునఃప్రారంభమైంది. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు కూడా నడుస్తున్నాయి. భారత్‌-చైనా సత్సంబంధాలు 2.8 బిలియన్ల ప్రజల ప్రయోజనాన్ని చేకూరుస్తాయి” అని ప్రధాని మోదీ తెలిపారు.
 
అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడుతూ, “ఈసారి టియాంజిన్‌లో మిమ్మల్ని మళ్ళీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. షాంఘై సహకార సంస్థ టియాంజిన్ శిఖరాగ్ర సమావేశానికి చైనాకు స్వాగతం. గత సంవత్సరం, మీరు, నేను కజాన్‌లో విజయవంతమైన సమావేశాన్ని జరిపాము.  చైనా-భారతదేశం సంబంధం తిరిగి ప్రారంభమైంది, కొత్తగా ప్రారంభమైంది. మనం అంగీకరించిన ముఖ్యమైన ఏకాభిప్రాయాన్ని రెండు వైపులా పరోక్షంగా అమలు చేశాయి.  ద్వైపాక్షిక మార్పిడులు మరియు, కొత్త పురోగతిని సాధించాయి,” అని చెప్పారు.
 
2026లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఈ సందర్భంగా మోదీ భారతదేశానికి ఆహ్వానించారు. భారతదేశం, చైనా ‘ప్రత్యర్థులు’ కాదని ‘అభివృద్ధి భాగస్వాములు’ అని ఇరువురు నేతలు  పునరుద్ఘాటించారని, వారి మధ్య ఉన్న విభేదాలు వివాదాలుగా మారకూడదని కూడా స్పష్టం చేశారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
రెండు దేశాల అభివృద్ధికి, బహుళ ధ్రువ ప్రపంచానికి ఇది అవసరమని వారు చెప్పారు. భారతదేశం, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రత్యక్ష విమానాల పునఃప్రారంభం, కైలాష్ మానసరోవర్ యాత్ర చాలా ముఖ్యమైనదని ఇద్దరు నాయకులు నొక్కి చెప్పారు. అయితే, ఈ సమావేశంలో, భారతదేశం-చైనా సంబంధాన్ని మూడవ దేశం దృష్టితో చూడకూడదని ప్రధాని మోదీ  హెచ్చరించారు.
 
“ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలు, సవాళ్లపై ఉమ్మడి మైదానాన్ని విస్తరించడం అవసరమని ఇద్దరు నాయకులు భావించారు. ఉగ్రవాదం, న్యాయమైన వాణిజ్యం వంటి బహుళ పక్ష వేదికలలో చైనా అధ్యక్ష పదవికి ప్రధాని మోదీ మద్దతు వ్యక్తం చేశారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.  సుమారు ఏడేళ్ల తర్వాత తొలిసారి మోదీ, జిన్​పింగ్​లు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా హాజరయ్యారు.
సుమారు 50 నిమిషాల పాటు వీరిద్దరు వివిధ అంశాలపై చర్చించారు.  అమెరికా భారీ సుంకాల నేపథ్యంలో ఇరుదేశాల మధ్యనున్న విభేదాలను పక్కన పెట్టి, రెండు ఆసియా పొరుగు దేశాలు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో ఇరువురు నేతలు సరిహద్దు సమస్యలు, ఆర్థిక పరమైన సవాళ్లు, అమెరికా సుంకాల వేళ ఎదురవుతున్న పరిస్థితులు వంటి అంశాలపై సమాలోచనలు సాగించినట్లు తెలుస్తోంది.
గల్వన్ ఘర్షణల సమయంలో రెండు దేశాల సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న కారణంగా ఇన్నేళ్లు భారత్ -చైనా దేశాధినేతలు ఎలాంటి చర్చల్లో పాల్గొనలేదు. గతేడాది బ్రిక్స్ సదస్సులో భాగంగా మోదీ-జిన్ పింగ్​లు రష్యాలోని కజన్​లో ఒకే వేదికపై కనిపించారు. తియాంజిన్ పర్యటనకు ముందు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి భారత్​, చైనాలు కలిసి పనిచేయడం ముఖ్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
అంతకు ముందు భారత్​పై ట్రంప్ అదనపు సుంకాలు విధించడానికి చైనా తప్పుపట్టింది. ఈ విషయంలో భారత్​కు తన పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.  తరువాత చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ భారతదేశాన్ని సందర్శించారు. ఇది జరిగిన పక్షం రోజుల్లోనే మోదీ చైనా పర్యటనకు వెళ్లారు.