రెండు రోజుల్లోనే 96.6 శాతంపెరిగిన ఓటర్ల దరఖాస్తులు

రెండు రోజుల్లోనే 96.6 శాతంపెరిగిన ఓటర్ల దరఖాస్తులు

కేవలం రెండు రోజుల్లోనే కొత్త ఓటర్ల దరఖాస్తులు 96.6 శాతం మేర పెరిగాయి. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు సెప్టెంబర్‌ 1తో గడువు ముగియనుండడంతో కొత్త ఓటర్ల దరఖాస్తుల సంఖ్య అమాంతం పెరిగింది. ఇసి అధికారిక సమాచారం ప్రకారం కొత్త ఓటర్లను చేర్చుకోవడానికి 8,51,788 మంది ఫారం 6 సమర్పించారని తెలిపింది.  ఆగస్టు 26 -28 కేవలం ఈ రెండు రోజుల్లోనే 4.18 లక్షలకు పైగా ఫారం 6 అందాయి. అంటే 48 గంటల్లోనే కొత్త ఓటర్ల సంఖ్య 96.6 శాతం పెరిగింది.

కాగా, ఆగస్టు 21 నాటికి ఎస్‌ఐఆర్‌పై ఓటర్ల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు.  రోజులవారీగా పరిశీలిస్తే ఆగస్టు 22 నాటికి 2,63,257 ఇసి 6 ఫారంలు అందుకుంది.  ఇక ఆగస్టు 23 నాటికి 2,83,042కి పెరిగింది. ఆగస్టు 24కి 3,28,847, ఆగస్టు 25కి 3,79,692, ఆగస్టు 26కి 4,33,214కి పెరిగింది. ఇక 27, 28 తేదీల్లో వీటి సంఖ్య రెండింతలు పెరిగింది. ఆగస్టు 27వ తేదీ 6,35,124, ఆగస్టు 28వ తేదీ 8,51,788కి చేరింది. ఈ ఫారాలు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసుగల వ్యక్తుల నుంచే వచ్చాయి. 

అయితే బూత్‌ లెవల్‌ ఏజెంట్ల ద్వారా స్వీకరించిన ఫారాలు తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. మొత్తం 8,51,788 ఫారాలలో ఆగస్టు 28 నాటికి 37,050 మాత్రమే ప్రాసెస్‌ అయ్యాయి.  ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై రాజకీయ పార్టీల నుంచి క్లెయిమ్‌లు చాలా తక్కువ సంఖ్యలోనే నమోదయ్యాయి.  1.6 లక్షల బూత్‌ లెవల్‌ ఏజెంట్స్‌ ఉన్నప్పటికీ ఆగస్టు 21 నాటికి రాజకీయ పార్టీల నుంచి క్లెయిమ్‌లు లేవు. అయితే ఆగస్టు 28 నాటికి 82 క్లెయిమ్‌లు దాఖలయ్యాయి. వీటిలో 79 కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్టు) లిబరేషన్‌, మూడు రాష్ట్రీయ జనతాదళ్‌ నుంచి నమోదయ్యాయి.