విశాఖ, భువనేశ్వర్ లు మహిళలకు భద్రత గల నగరాలు!

విశాఖ, భువనేశ్వర్ లు మహిళలకు భద్రత గల నగరాలు!

ఏపీ ఆర్థిక, ఐటీ రాజధాని విశాఖపట్నం దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది. మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా దాదాపు 31 నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. దాదాపు13,770 మంది మహిళల నుంచి అభిప్రాయాలు సేకరించారు.  ఈ నివేదికలో జాతీయ భద్రతా స్కోరును 65 శాతంగా పేర్కొంది. 
దీనికి ఎగువన ఉన్న నగరాలను సురక్షితమైనవిగా, దిగువన ఉన్న వాటిని భద్రత లేనివిగా వర్గీకరించింది. 
సురక్షితమైన నగరాల జాబితాలో విశాఖ, భువనేశ్వర్, కోహిమా, ఐజ్వాల్‌, ఈటా నగర్‌, ముంబై, గాంగ్‌ టాక్‌లు నిలిచాయి. పట్నా, జైపుర్, ఫరిదాబాద్, దిల్లీ, కోల్‌కతా, శ్రీనగర్, రాంచీలు భద్రత లేని ప్రాంతాలుగా ఉన్నాయి.  జాతీయ మహిళా కమిషన్‌  ఛైర్‌పర్సన్‌ విజయా రహత్కర్‌ నివేదికను విడుదలచేస్తూ మహిళల క్షేమాన్ని కేవలం శాంతిభద్రతల సమస్యగా చూడలేమని, అది స్త్రీ జీవితంలోని విద్య, ఆరోగ్యం, ఉద్యోగావకాశాలు, స్వేచ్ఛ వంటి ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక శాంతి, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది.

మహిళల భద్రత కోసం ప్రత్యేకగా శక్తి యాప్‌ను తీసుకువచ్చింది. ఇక ప్రజా రవాణాలో మహిళల సెక్యూరిటీ కోసం గతంలో ప్రారంభించిన అభయం ప్రాజెక్టును తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. మహిళలు, బాలికలపై వేధింపులు, నేరాలను నివారించడానికి, అవసరమైనప్పుడు తక్షణ సహాయం, రక్షణ అందించడానికి శక్తి టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌లు బహిరంగ ప్రదేశాలలో పనిచేస్తాయి. మహిళలకు అండగా నిలుస్తాయి. 

ఈ నివేదికపై హోమ్ మంత్రి వంగలపూడి అనిత స్పందిస్తూ దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా విశాఖపట్నం నిలవడం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు, పోలీస్ శాఖ కృషికి నిదర్శనమని కొనియాడారు. మహిళల భద్రతపై జాతీయ వార్షిక నివేదిక – 2025లో దేశంలోని 6 నగరాలతో పాటు విశాఖపట్నం ప్రథమస్థానంలో నిలవడం రాష్ట్రానికి గర్వకారణమని ఆమె తెలిపారు. 

లింగ సమానత్వం, పౌర భాగస్వామ్యం, మెరుగైన పోలీసుశాఖ పనితీరు, మహిళలకు అనుకూలమైన మౌలిక సదుపాయాలతో విశాఖపట్నం, భువనేశ్వర్, కోహిమా, ఆయిజోల్, ఈటానగర్, ముంబై, గ్యాంగ్ టక్ నగరాలు మొదటి స్థానంలో నిలిచాయని ఆమె వెల్లడించారు.  ఇన్విజిబుల్ పోలీస్ – విజిబుల్ పోలీసింగ్, మహిళల రక్షణ కోసం శక్తి యాప్, పోలీస్ వ్యవస్థలో టెక్నాలజీ వినియోగం వంటి అంశాలతో రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని మంత్రి తెలిపారు. మహిళల రక్షణకు ప్రాధాన్యమిస్తున్న నగరంగా దక్షిణ భారతదేశంలోనే విశాఖపట్నం మాత్రమే నిలవడం విశేషమని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.