
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పునిచింది. టారిఫ్‌లను విధించేందుకు అధ్యక్షుడికి విస్తత అధికారాలు లేవని స్పష్టం చేస్తూ, ఓ ఫెడరల్ అప్పీల్స్ కోర్టు సంచలన వాఖ్యలు చేసింది. ట్రంప్ విధించిన సుంకాలు చాలా వరకు చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి అధికంగా టారిఫ్‌లను పెంచినట్లు వ్యాఖ్యానించింది. భారీగా విధించిన టారిఫ్‌ల వల్ల పలు దేశాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయయని పేర్కొంది.
ట్రంప్ టారిఫ్‌లపై ఫెడరల్ అప్పీల్ కోర్టు 7-4 తేడాతో తీర్పు వెలువరించింది. ఈ తీర్పు సుప్రీంకోర్టులో కూడా నిలబడితే, భారత్‌పై విధించిన 25 శాతం ప్రతిస్పందన సుంకం రద్దవుతుంది. అయితే ప్రస్తుతానికి పెంచిన సుంకాలను అక్టోబర్ మధ్య వరకు కొనసాగించడానికి అనుమతించింది. ఈమేరకు 7-4 తేడాతో న్యాయమూర్తులు తీర్పును వెలువరించారు. ఈ తీర్పుపై యూఎస్ సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు అనుమతించారు.
గత జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ పేరుతో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అగ్రరాజ్యంతో వాణిజ్యం చేస్తున్న ప్రతి దేశంపై టారీఫ్‌లు విధించేలా ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనమిక్ పవర్స్ యాక్ట్ (ఐఈఈపిఎ)ను ట్రంప్ తీసుకొచ్చారు. బేస్‌లైన్‌గా 10 శాతం టారిఫ్ విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తుందన్న సాకుతో భారత్‌పై 50 శాతం సుంకాలు విధించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.
ఈ తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందిస్తూ ఇది అత్యంత పక్షపాతంతో కూడుకున్న నిర్ణయమని, దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో పేర్కొన్నారు. ”ఈ తీర్పు ఇలాగే కొనసాగితే, అది అమెరికాను నాశనం చేస్తుంది” అని అంటూ ఆయన మండిపడ్డారు. “అన్ని సుంకాలు ఇప్పటికీ అమలులో ఉన్నాయి! ఈరోజు అత్యంత పక్షపాత అప్పీళ్ల కోర్టు మన సుంకాలను తొలగించాలని తప్పుగా చెప్పింది, కానీ చివరికి అమెరికా గెలుస్తుందని వారికి తెలుసు” అంటూ ట్రంప్ ప్రకటించారు.
ఈ సుంకాలు ఎప్పుడైనా తొలగిపోతే, అది దేశానికి పూర్తి విపత్తు అవుతుందని, ఇది”మనం బలంగా ఉండాలి. అమెరికా ఇకపై అపారమైన వాణిజ్య లోటులను, అన్యాయమైన సుంకాలను, ఇతర దేశాలు, స్నేహితులు లేదా శత్రువులు విధించిన సుంకం కాని వాణిజ్య అడ్డంకులను సహించదు” అని స్పష్టం చేశారు. “ఇవి మన తయారీదారులు, రైతులు, ప్రతి ఒక్కరినీ బలహీన పరుస్తాయి. దీనిని నిలబెట్టడానికి అనుమతిస్తే, ఈ నిర్ణయం అక్షరాలా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను నాశనం చేస్తుంది, ”అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు.
ముఖ్యంగా భారత్, చైనాలను ఆయన టార్గెట్ చేశారు. చివరకు చైనాను ఏమీ చేయలేక భారత్‌పై పడ్డారు. రష్యా నుంచి భారత్, చైనాలు చమురు కొనుగోలు చేస్తుండడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేయమని భారత్‌పై ఒత్తిడి తెచ్చారు. అందులో భాగం మొదట 25 శాతం సుంకాలు విధించారు. అవి ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చాయి. అదే రోజున మరో 70 దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్‌లు అమల్లోకి వచ్చాయి.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు