నెల్లూరు రూరల్ టిడిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర పన్నినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాజకీయ కలకలం చెలరేగింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని హత్య చేయాలని ఐదుగురు రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ వేసినట్లు సమాచారం. ఈ హత్య మాస్టర్ ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్‌తోపాటు అతడి ముఖ్య అనుచరుడు జగదీష్ ఉన్నట్లు తెలుస్తోంది.
రౌడీషీటర్లు జగదీష్, మహేష్, వినీత్‌తోపాటు మరో ఇద్దరు సదరు వీడియోలో విపరీతంగా మద్యం సేవించి ఈ ప్లాన్ గురించి చర్చించినట్లు సమాచారం. లేడీ డాన్ నిడిగుంట అరుణ ద్వారా రౌడీషీటర్లు అవిలేల శ్రీకాంత్, జగదీష్ ఇంకా కొంతమంది ఈ పథకం రచించినట్టు కోటంరెడ్డి వర్గీయులు గుర్తించారు. వీడియోతో సహా సాక్ష్యాలు సేకరించారు. వెంటనే స్పందించడంతో కోటంరెడ్డి ప్రాణాలకు ముప్పు తొలగిందని అంటున్నారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్వయంగా ఫోన్ చేసి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ ప్రభుత్వం మొత్తం మీకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఆమె భరోసా కల్పించారు. ఇటీవల ఆయనపై వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగింది. కోటంరెడ్డిని హత్య చేస్తే వచ్చే ఎన్నికల్లో గూడూరు లేదా సూళ్లూరుపేట ఎమ్మెల్యే టికెట్టు ఇస్తామని అరుణకు వైఎస్సార్సీపీ కీలక నేత ఒకరు హామీ ఇచ్చినట్టు ప్రచారం నడుస్తోంది. డబ్బుతో ప్రలోభపెట్టి కోటంరెడ్డి అనుచరులను రౌడీషీటర్లు తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేసినట్టు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.
రౌడీషీటర్ల వీడియో విడుదలఅంశం తమ దృష్టికి రాలేదని నెల్లూరు ఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. ఎమ్మెల్యే కోటంరెడ్డితో మాట్లాడుతామని ఆయన కోరితే రక్షణ కల్పిస్తామని చెప్పారు. ఈ విషయమై తమ దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీడియోలో ఉన్న మహేశ్, వినీత్, మల్లిలను అదుపులోకి తీసుకున్నారు.ఈ కుట్ర వెనుక ఉన్న అసలు కారణాలు, ఇతర వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.
తన హత్యకు కుట్ర పన్నినట్లు వీడియో వెలుగులోకి రావడంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. మంత్రి పదవి కంటే తనకు ప్రాణాలే ముఖ్యమని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కోటంరెడ్డి పార్టీ నాయకత్వానికి సమాచారం ఇచ్చారు. అయితే ఈ హత్య కుట్ర వెనుక వైసీపీ పెద్దల హస్తముందని టీడీపీ శ్రేణులు సందేహం వ్యక్తం చేస్తున్నాయి.
అంతేకాకుండా వైఎస్ వివేకానందరెడ్డి హత్య తరహాలోనే ఎమ్మెల్యే కోటంరెడ్డిని అంతమొందించాలని కుట్రపన్నారనే చర్చలూ జరుగుతున్నాయి. ఈ సదరు వీడియో వ్యవహారం ఐదురోజుల కిందట పోలీసులకు తెలిసిందని, కానీ వారు స్పందించలేదని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
More Stories
టీచర్లుగా కొనసాగాలంటే టెట్ తప్పనిసరి
5 గ్యారెంటీలతో దివాలా అంచుకు కర్ణాటక
వైద్య విద్యకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి