చైనా చేరుకున్న ప్రధాని మోదీ .. జిన్‌పింగ్‌తో భేటీపై అందరి దృష్టి

చైనా చేరుకున్న ప్రధాని మోదీ .. జిన్‌పింగ్‌తో భేటీపై అందరి దృష్టి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చైనా చేరుకున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత బీజింగ్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా టియాంజిన్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రధానికి రెడ్‌కార్పెట్‌ వేసి అక్కడి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. . ఓ దేశ ప్రధాని లేదా అధ్యక్షుడికి ఎయిర్ పోర్ట్ లో రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం అరుదు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 1 వరకూ రెండు రోజుల పాటూ చైనాలో ప్రధాని పర్యటించనున్నారు. అక్కడ టియాంజిన్‌ లో జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో  పాల్గొననున్నారు. 
 
అయితే, ఈ పర్యటన సందర్భంగా తొలిరోజు అంటే ఆగస్టు 31న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ జరుపనున్న ద్వైపాక్షిక సమావేశం పైననే అందరి దృష్టి నెలకొంది భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అదనపు సుంకాల వేళ మోదీ చైనా పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్టానుసారంగా టారిఫ్ విధిస్తూ భారత్ ను బెంబేలెత్తిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భేటీ విశేష ప్రాధాన్యత సంతరింప చేసుకుంది.

ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? తదుపరి చర్యలు ఎలా ఉండబోతోన్నాయనేది చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల మధ్య ట్రంప్ దూకుడును కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ  చైనాతో మిత్రత్వాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు.
ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలపై ప్రధానంగా చర్చించనున్నారు. 


లఢక్ తూర్పు ప్రాంతం సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద గల గాల్వన్ వ్యాలీలో 2020 జూన్ 15, 16వ తేదీల్లో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటనలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. అప్పటి నుంచి వాస్తవాధీన రేఖ వద్ద చాలాకాలం పాటు యుద్ధ వాతావరణం కొనసాగుతూనే వచ్చింది.
ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటోన్నాయి. 
ఇటీవలే విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ చైనాలో పర్యటించారు. ఆ దేశ పౌరులకు విసాలను సైతం కేంద్రం పునరుద్ధరించింది. చైనా అధ్యక్షుడు సహితం భారత్ పై ట్రంప్ సుంకాల దాడిని ఖండించడంతో పాటు పలు కీలక అంశాలతో భారత్ పట్ల సానుకూలంగా వ్యక్తం చేస్తున్నారు.  మరోవంక, ఇక్కడనే రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కూడా ప్రధాని మోదీ సమావేశం అయ్యే అవకాశం ఉంది. భారత్, చైనా, రష్యా ఉమ్మడిగా అమెరికా సుంకాల దాడులను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాయా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.