భారతదేశం చేపట్టనున్న చంద్రయాన్-5 ప్రాజెక్టులో జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా భాగస్వామి అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష సహకారానికి చిహ్నంగా ఇస్రో, జాక్సా కలిసి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తాయని ఆయన చెప్పారు. జపాన్ పర్యటన సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. ఇది రెండు ఆసియా ప్రజాస్వామ్య దేశాల (ఇండియా, జపాన్) మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక, శాస్త్రీయ భాగస్వామ్యాన్ని తెలియజేస్తుంది.
జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో సమావేశమైన మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. “చంద్రయాన్ 5 మిషన్‌లో సహకారం కోసం, ఇస్రో, జెఏఎక్స్ఏల మధ్య ఒప్పందాన్ని మేము స్వాగతిస్తున్నాము. మన క్రియాశీల సహకారం భూమి సరిహద్దులను దాటి అంతరిక్షంలో మానవాళి పురోగతికి చిహ్నంగా మారుతుంది” అని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
భారత్, జపాన్ మధ్య బలమైన, స్నేహపూర్వక సంబంధాలను, విస్తృత శ్రేణి రంగాల్లో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తాము నిబద్ధతతో ఉన్నామని నొక్కి చెప్పారు. మానవ వనరుల అభివృద్ధి సహా ద్వైపాక్షిక, సాంస్కృతిక సంబంధాలను మరింత పెంపొందించడంపై తాము అభిప్రాయాలు పంచుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఇరుదేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని విస్తరించడం, ఆరోగ్యం, చలనశీలత, కృత్రిమ మేధ, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగస్వామ్యాలను పెంచడంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు మోదీ తెలిపారు.
ఇస్రో చేపట్టనున్న చంద్రయాన్-5లో జపాన్ భాగస్వామి కావడం వల్ల హై-టెక్నాలజీ రంగాల్లో, అంతరిక్ష పరిశోధనలో ఇరుదేశాలు ఉమ్మడిగా పురోగతి సాధించడానికి వీలవుతుంది. ముఖ్యంగా జపాన్ భాగస్వామ్యం వల్ల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన నైపుణ్యాలు ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. ఇది శాంతియుత, శాస్త్రీయ ప్రయోజనాల కోసం అంతరిక్షాన్ని అన్వేషించాలనే ఆశయాన్ని ప్రతిబింబిస్తుంది. భారత్ చేపట్టిన చంద్రయాన్ ప్రాజెక్టులు అన్నీ విజయవంతం అయ్యాయి.
చంద్రయాన్-4 లైన్లో ఉంది. చంద్రుని నుంచి రాళ్లు, మట్టి నమూనాలు తీసుకొచ్చేందుకు దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. దీని తర్వాతనే చంద్రయాన్ -5 చేపడతారు. ఇది కనుక విజయవంతం అయితే చంద్రుని ఉపరితలం, పర్యావరణంపై శాస్త్రీయ అవగాహన మరింత పెరుగుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. అందుకే చంద్రయాన్ -5 మిషన్ కోసం భారత్ తయారీ ల్యాండర్, జపాన్ నిర్మిత రోవర్ వాడనున్నారు. ఇది ఇప్పటి వరకు చంద్రుని ఉపరితలంపై మోహరించిన అత్యంత బరువైన రోవర్గా ఉండనుంది.
ఈ చంద్రయాన్-5ను జపాన్ నుంచి ప్రయోగించనున్నారు. ఈ ఉమ్మడి మిషన్ ప్రాంతీయ స్థిరత్వం, ప్రపంచ ఆవిష్కరణలకు దోహదపడే లక్ష్యంతో ఇండియా, జపాన్లు చేపడుతున్నాయి. ఇస్రో ఇప్పటికే చంద్రయాన్-6, చంద్రయాన్-7, చంద్రయాన్-8 కోసం ముందస్తు ప్రణాళికలను రూపొందిస్తోంది.
More Stories
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్లకు భారత్ హెచ్చరిక
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా డ్రోన్లు కూల్చేసిన పోలాండ్