అమెరికా ఇటీవల భారత్‌పై భారీగా సుంకాలు విధించింది. భారత్ ఒక డెడ్ ఎకానమీ అంటూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే అమెరికా సుంకాల ప్రభావం ఉన్నా ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 తొలి త్రైమాసికంలో సత్తా చాటింది. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో భారత దేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలకు మించి 7.8 శాతంగా నమోదైంది.
తాజాగా కేంద్ర గణాంకాల విభాగం (ఎన్ఎస్ఓ) దేశ స్థూల ఆర్థిక వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 తొలి త్రైమాసికంలో 7.8 శాతం నమోదైనట్లు తెలిపింది. గత ఐదు త్రైమాసికాల్లో ఇదే అత్యధికమని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉండగా అంతకు ముందు ఏడాది అదే త్రైమాసికంలో 6.7 శాతంగా ఉంది.
దేశ వాస్తవ జీడీపీ స్థిర ధరల్లో చూస్తే ఈ ఏడాది ఏప్రిల్- జూన్‌లో రూ.47.89 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఎన్ఎస్ఓ పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.44.42 లక్షల కోట్లుగా ఉందని, దాంతో పోలిస్తే ఈసారి 7.8 శాతం వృద్ధి నమోదు చేసినట్లు తెలిపింది. అయితే, నామమాత్ర జీడీపీ ప్రస్తుత ధరల్లో చూస్తే ఏకంగా రూ.86.05 లక్షల కోట్లుగా ఉంది.
గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.79.08 లక్షల కోట్లుగా ఉండగా దాంతో పోలిస్తే 8.8 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇక రంగాల వారీగా చూస్తే వ్యవసాయం రంగంలో 3.7 శాతం వృద్ధి నమోదు కాగా తయారీ రంగంలో 7.7 శాతం వృద్ధి నమోదైంది. సేవల రంగానికి వస్తే 9.3 శాతం వృద్ధి సాధించింది. వాణిజ్యం, హోటళ్లు, రవాణా, సమాచార రంగాలు 8.6 శాతం వరకు వృద్ధి సాధించాయి. ఫైనాన్షియల్, స్థిరాస్తి, ప్రొఫెషనల్ సేవల రంగాలు 9.5 శాతం పెరిగాయి.
మరోవంక, భారత రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం, ఒక అమెరికన్ డాలర్ విలువ భారతీయ రూపాయలలో రూ. 87.97కు చేరింది. ఇది రూపాయి చరిత్రలోనే అత్యంత కనిష్ట విలువగా నమోదు కావడం ఆర్థిక రంగంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రూపాయి విలువ ఇలా పడిపోవడానికి అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, వాణిజ్య యుద్ధాలు, మరియు అమెరికా-భారత్ మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు ప్రధాన కారణాలని విశ్లేషకులు చెబుతున్నారు.

More Stories
సుంకాలు పెంచుతానని ట్రంప్ మరోసారి హెచ్చరిక!
వెనెజువెలా పరిణామాలతో లాభపడనున్న ఓఎన్జీసీ!
దేశంలో భారీగా తగ్గిన ఏటీఎంల సంఖ్య