రాంబన్ జిల్లాలోని రాజ్ఘడ్ విలేజ్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఓ పాఠశాలను వరద ముంచెత్తింది. ఈ వరదకు ఐదుగురు కొట్టుకుపోయారు. వీరిలో నలుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ గుర్తించింది. గల్లంతైన వారి కోసం గాలింపు చేపడుతోంది. మరోవైపు గ్రామంలో కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. దీంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. మరోవైపు భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
జమ్ము వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు పెట్టాలని సూచించారు. వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనల్లో జమ్ము ప్రాంతంలో దాదాపు 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారుల అంచనా. మృతుల్లో ఎక్కువ మంది యాత్రికులే కావడం గమనార్హం.
మరోవైపు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. శని, ఆదివారాల్లో పూంఛ్, కిశ్త్‌వాడ్, జమ్మూ, రాంబన్, ఉధంపుర్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీనితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి దూరంగా వెళ్లాలని అధికారులు కోరారు.
ఆగస్టు 14 నుండి, జమ్మూ కాశ్మీర్లో నిరంతర మేఘావృతాలు, కొండచరియలు విరిగిపడటంతో ఈ ప్రాంతం అంతటా 130 మంది మరణించగా, 140 మంది గాయపడ్డారు. 32 మంది యాత్రికులు ఇంకా కనిపించడం లేదు. ఈ వారం ప్రారంభంలో కాట్రా నుండి 12 కిలోమీటర్ల ట్రెక్కింగ్‌లో 34 మంది యాత్రికులు మరణించిన కొండచరియల కారణంగా రియాసిలోని త్రికుట కొండలపై ఉన్న మాతా వైష్ణో దేవి మందిరానికి యాత్ర వరుసగా ఐదవ రోజు కూడా నిలిపివేశారు.
జమ్మూకశ్మీర్‌లో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి నదులు ఉప్పొంగిపొర్లుతున్నాయి. వరదల ధాటికి జమ్మూ- శ్రీనగర్ జాతీయరహదారితో సహా పలు ప్రాంతాల్లోని ప్రధాన మార్గాలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా ఉధంపుర్ జిల్లాలోని జఖేనీ, చెనాని మధ్య కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇక్కడ రెండు వేలకుపైగా వాహనాలు నిలిచిపోయాయి.

More Stories
వికసిత్ భారత్ కు అవసరమైన ప్రతి సహకారం అందిస్తాం
2030 నాటికి 100 బిలియన్ డాలర్ల భారత్- రష్యా వాణిజ్యం
దేవాలయాలకు మొదటి సంరక్షకులు న్యాయస్థానాలే