రిషికొండ ఉపయోగంపై మంత్రివర్గ ఉపసంఘం

రిషికొండ ఉపయోగంపై మంత్రివర్గ ఉపసంఘం
విశాఖలోని రిషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన రిసార్ట్‌ వినియోగానికి అధ్యయనం చేసి, సిఫార్సులు చేసేందుకు ఏపీ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రివర్గ ఉపసంఘంలో పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌, ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామిని నియమించారు. 
 
పర్యాటక, యూత్‌ అడ్వాన్స్‌మెంట్‌, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మంత్రి వర్గ ఉపసంఘానికి కన్వీనరుగా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతకు ముందు శుక్రవారం ఉదయం రిషికొండను సందర్శించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రిషికొండ రిసార్ట్స్‌ను టూరిజంగా ఎలా చేయాలన్నది ఆలోచిస్తున్నాం అని తెలిపారు. మంత్రులు  నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ , ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి రుషికొండ భవనాలను పరిశీలించారు. 
నిర్మాణాల నాణ్యత, నిర్మాణ ఖర్చు, ప్రస్తుత నిర్వహణ ఖర్చులపైనా అధికారులతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు.  అనంతరం పార్టీ మంత్రులు, శాసనసభ్యులతో రుషికొండ భవనాల నిర్వహణ, తదుపరి కార్యాచరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రెండు బ్లాక్‌ లకి మాత్రమే రూ.90 కోట్లు, ఒకదానికి రూ.70 కోట్లు ఖర్చు చేశారని,  7 బ్లాక్‌ లకి 4 మాత్రమే రూ 454 కోట్లతో కట్టారని చెప్పారు. 
గతంలో తమను రానివ్వలేదనీ, ఎన్నో అడ్డంకులు సృష్టించారనీ గుర్తు చేసుకున్నారు. గతంలో రిసార్ట్స్‌ ఉన్నప్పుడు సంవత్సరానికి రూ.7 కోట్లు ఆదాయం ఉండేదని, ప్రస్తుతం కేవలం కరెంట్‌ బిల్లు సంవత్సరానికి రూ.15 లక్షలు అవుతుందని తెలిపారు.  ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిందని చెబుతూ  లోపల పెచ్చులు ఉడిపోతున్నాయి కొన్ని చోట్ల లీకేజ్‌ అవుతుందని పేర్కొన్నారు.
జగన్ మోహన్ రెడ్డి  నివాసం ఉండడానికి కట్టారు కానీ మనం దీనిని టూరిజం కింద ఎలా చేయాలన్నది ఆలోచిస్తున్నాం అని పవన్‌ తెలిపారు. మేజర్‌ గా ఈ నిర్మాణాన్ని ఎలా ఉపయోగించాలో ఆలోచన చేస్తున్నామని చెబుతూ ముందుగా దీనిని క్లీన్‌ చేయించాలని డిప్యూటీ సిఎం పవన్‌ తెలిపారు.