ప్రపంచమంతా భారత్​పైనే ఆశలు.. విదేశీ పెట్టుబడులు రెట్టింపు

ప్రపంచమంతా భారత్​పైనే ఆశలు.. విదేశీ పెట్టుబడులు రెట్టింపు
ప్రపంచం అంతా భారత్‌పైనే ఆశలు పెట్టుకుందని చెబుతూ విదేశీ కంపెనీలు భారత్​లో పెట్టుబడులు కేవలం పెరగడమే కాకుండా రెట్టింపు అవుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్‌-జపాన్‌ వార్షిక సదస్సు కోసం రెండు రోజుల పర్యటనకు శుక్రవారం జపాన్ కు చేరుకున్నప్రధాని టోక్యోలో ఇండియా-జపాన్‌ ఎకనామిక్‌ ఫోరంలో పాల్గొన్నారు. జపాన్‌ వ్యాపార దిగ్గజాలు హాజరైన ఆ సదస్సుకు మోదీని, జపానీయులు గాయత్రి మంత్రం పటిస్తూ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధానమంత్రి భారత అభివృద్ధి ప్రయాణంలో జపాన్‌ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. మెట్రోలు, సెమీకండక్టర్స్‌, స్టార్టప్‌లు, మాన్యుఫక్చరింగ్‌లు ఇలా అనేకరంగాల్లో తోడ్పాటు అందించిందని పేర్కొన్నారు. ఇప్పటికే జపాన్‌సంస్థలు భారత్‌లో 40బిలియన్‌ డాలర్ల కన్నా ఎక్కువ పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. భారత్‌లో ఆర్థిక, రాజకీయ స్థిరత్వం నెలకొందన్న మోదీ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని వివరించారు. ప్రభుత్వపరంగా పారదర్శకమైన విధానాలను అవలంభిస్తున్నట్లు పేర్కొన్నారు. 

భారత్‌ మార్కెట్లు భారీ రాబడిని అందిస్తున్నాయని, తమకు బలమైన బ్యాంకింగ్ రంగం, 700 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయని వివరించారు. అణుశక్తి, గ్రీన్‌ ఎనర్జీ, ఆటోసెక్టార్‌లో రెండు దేశాలు మరింత కలిసికట్టుగా పనిచేయాలని మోదీ సూచించారు. జపాన్ ఓ టెక్ పవర్​హౌస్, భారత్​ ప్రతిభకు కేంద్రమని చెప్పారు.  ఈ రెండు కలిసిపోతే ఈ శతాబ్దపు సాంకేతిక విప్లవానికి నాయకత్వం వహించగలవని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు.

‘ఏఐ, సెమీకండక్టర్, క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్, అంతరిక్ష రంగాల్లో భారతదేశం సాహసోపేతమైన, ప్రతిష్టాత్మకమైన చర్యలు తీసుకుంది. జపాన్ సాంకేతికత, భారతదేశ ప్రతిభ కలిసి పనిచేస్తే ఈ శతాబ్దపు సాంకేతిక విప్లవానికి నాయకత్వం వహించగలవు” అని చెప్పారు. 

“2030వరకు 500 గిగావాట్ల పునరుత్పాదక శక్తి, 2047 కల్లా 100 గిగావాట్ల అణువిద్యుత్‌ సాధనను లక్ష్యంగా భారత్‌ నిర్దేశించుకుంది. సోలార్‌ సెల్స్‌ అయినా, గ్రీన్‌ హైడ్రోజన్ అయినా భాగస్వామ్యం కోసం అపార అవకాశాలు ఉన్నాయి. స్వచ్ఛ ఇంధనం, పర్యావరణ అనుకూల భవిష్యత్తుపై సహకారం కోసం జాయింట్ క్రెడిట్ మెకానిజంపై భారత్-జపాన్ ఒక ఒప్పందంపై సంతకం చేశాయి” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

జపాన్ ఆధునిక సాంకేతికత, భారత ప్రతిభ కలిస్తే రెండు దేశాలు ఆర్థిక సంబంధాలు విస్తృతంగా అభివృద్ధి చెందుతాయని జపాన్ ప్రధాని షిగెరూ ఇషిబా తెలిపారు. ‘అనేక జపాన్ కంపెనీలు మేక్ ఇన్ ఇండియాలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సహకారం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. నేడు సంతకం చేసిన కొత్త ఒప్పందాలు జపాన్ భారత్‌లో పెట్టుబడులు పెంచాలన్న సంకల్పానికి నిదర్శనం. ఇది రెండు దేశాలపై ఆధారపడి ఉన్న బలమైన సరఫరా గొలుసును నిర్మిస్తున్నట్టు స్పష్టం చేస్తోంది’ అని ఆయన తెలిపారు.