ప్రధాని మోదీకి రాహుల్‌ క్షమాపణలు చెప్పాలి

ప్రధాని మోదీకి రాహుల్‌ క్షమాపణలు చెప్పాలి
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బీహార్‌లో చేపట్టిన ఓటర్‌ అధికార్‌ యాత్ర వివాదాస్పదమైంది. ఈ యాత్రలో ఓ కాంగ్రెస్ కార్యకర్త ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తం చేసారు.
మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇందుకు గానూ మోదీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘అనుచిత వ్యాఖ్యలకు గానూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన తల్లి, దేశ ప్రజలకు రాహుల్‌ గాంధీ క్షమాపణలు చెప్పాలి’ అని షా డిమాండ్‌ చేశారు. ‘మోదీ తల్లి చాలా పేద కుటుంబంలో తన జీవితాన్ని గడిపారు. తన పిల్లలను అత్యున్నత విలువలతో పెంచారు. అలాంటి మనిషిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు’ అని స్పష్టం చేశారు. 
 
‘దీన్ని దేశ ప్రజలు ఎప్పటికీ సహించరు. రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ రాజకీయాలు అత్యంత దిగజారాయి. కాంగ్రెస్‌ పార్టీ దాని పాత స్వభావాన్ని, సంస్కృతిని తిరిగి తీసుకొచ్చింది. దేశ రాజకీయాల్లో విషం నింపుతోంది’ అంటూ షా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై పాట్నాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో బిజెపి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. కాంగ్రెస్ ఎంపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. 
దర్భాంగాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తేజస్వి యాదవ్‌ల పోస్టర్‌లు ఉన్న వేదిక నుండి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని మోదీపై అవమానకరమైన భాషను ఉపయోగిస్తున్నట్లు వీడియోలో ఉంది.  ఇదే ప్రదేశం నుండి రాహుల్ గాంధీ, ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మోటార్ సైకిళ్లపై ముజఫర్‌పూర్‌కు బయలుదేరారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సహా పలువురు నాయకులు ప్రధాని మోదీపై కాంగ్రెస్ ర్యాలీలో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు.

“ఘుస్పైథియా బచావో యాత్రలో ప్రధాని మోదీ తల్లిపై కాంగ్రెస్ నాయకులు అవమానకరమైన పదజాలం ఉపయోగించడం ద్వారా అత్యంత ఖండించదగిన చర్యకు పాల్పడ్డారు.  ప్రతి కాంగ్రెస్ నాయకుడు ప్రధాని మోదీపై అవమానకరమైన పదాలు మాట్లాడారు” అని షా ధ్వజమెత్తారు. రాజకీయాల్లో “ద్వేష సంస్కృతి”ని వ్యాప్తి చేయడానికి కాంగ్రెస్ బాధ్యత వహిస్తుందని షా తన దాడిని తీవ్రతరం చేశారు.