
సమ్మిళిత ఆర్థికాభివృద్ధిని పెంపొందించడంతో పాటు కోట్లాది మందికి ముఖ్యంగా మహిళలు, యువత, అణగారిన వర్గాలకు గౌరవాన్ని అందించే లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో తీసుకొచ్చిన ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన విజయవంతంగా 11 ఏళ్లు పూర్తి చేసుకోవడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ పథకం ప్రారంభించిన సమయంలో దేశంలోని అనేకమంది బడుగు, బలహీన, పేద ప్రజలకు కనీసం బ్యాంకు ఖాతా కూడా లేదని, ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం 2014 ఆగస్టు 28వ తేదీన ప్రధానమంత్రి జన్‌ధన్ యోజనను అమల్లోకి తెచ్చిందని గుర్తు చేశారు.
నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 56 కోట్ల జన్‌ధన్ ఖాతాల్లో రూ.2.68 లక్షల కోట్ల నగదు జమ అయిందని చెప్పారు. 2014 కు ముందు దేశవ్యాప్తంగా మొత్తం 3.35 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ బ్యాంకు అకౌంట్లు (జీరోబ్యాలెన్స్ సౌకర్యంతో బ్యాంకు అకౌంట్లు) మాత్రమే ఉండగా, వాటిలో ఖాతాదారులు జమ చేసుకున్న మొత్తం డబ్బు రూ.960 కోట్లు మాత్రమే అని చెప్పారు.
ఈ సంస్కరణల ఫలితంగా.. 2014 నుంచి ఇప్పటివరకు ఈ 11 ఏళ్లలో ఈ ‘జన్ ధన్’ బ్యాంకు అకౌంట్ల సంఖ్య 56 కోట్లకు పెరగగా, అందులో ఖాతాదారులు జమచేసుకున్న మొత్తం రూ.2.68 లక్షల కోట్ల నగదు ఉందని తెలిపారు. అంటే సామాన్యులు బ్యాంకు ఖాతాల్లో 1,572% (16 రెట్లు) వృద్ధి నమోదైందని, అందులో ఆ ఖాతాదారులు జమచేసుకున్న మొత్తంలో 27,816% (278 రెట్లు) పెరుగుదల నమోదైందని వివరించారు.
ఇది ప్రజల భాగస్వామ్యంతో దేశం సాధించిన నిశ్శబ్ధ విప్లవం అని స్పష్టం చేశారు. తెలంగాణలోనూ జన్‌ధన్ యోజన పథకంలో భాగంగా 1.3 కోట్ల అకౌంట్లు తెరవగా, అందులో ఖాతాదారులు రూ.5,055.35 కోట్లు జమ చేసుకున్నారని చెప్పారు. ఈ జన్‌ధన్ యోజన పథకం అందుబాటులోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాలతోపాటుగా, రాష్ట్ర ప్రభుత్వాల లబ్ధి కూడా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా 100% నేరుగా లబ్ధిదారులకు అందుతోందని తెలిపారు.
పైగా, ఈ జన్‌ధన్ ఖాతాల్లో 56 శాతం కన్నా ఎక్కువ ఖాతాలు మహిళల పేరుతోనే ఉన్నాయని తెలిపారు. జన్‌ధన్ యోజన ద్వారా కేవలం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6.9 లక్షల కోట్ల మేర నగదును లబ్ధిదారుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేసిందని చెప్పారు. జన్‌ధన్ ఖాతాలతో పాటు ఖాతాదారులకు రూపే కార్డు, బీమా, ఓవర్ డ్రాఫ్ట్, పెన్షన్, మైక్రో ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలు పేద ప్రజలకు అందుతున్నాయని వివరించారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి