జపాన్, చైనా పర్యటనల్లో టోక్యోకు చేరుకున్న ప్రధాని మోదీ

జపాన్, చైనా పర్యటనల్లో టోక్యోకు చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం టోక్యో చేరుకున్నారు. అక్కడ ఆయన జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో సమావేశమై 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. రెండు రోజుల దేశ పర్యటన సందర్భంగా, ప్రధాని టోక్యోలో జపాన్ పారిశ్రామికవేత్తలు,  రాజకీయ నాయకులను కూడా కలుస్తారు. ఇషిబా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జపాన్‌కు చేస్తున్న ఎనిమిదవ పర్యటన ఇది.
 
భారతదేశం, జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా, ఈ పర్యటన ప్రధాని మోదీకి ఇషిబాతో లోతైన చర్చలు జరిపే అవకాశం కల్పిస్తుంది. “టోక్యోలో అడుగుపెట్టాను. భారతదేశం, జపాన్ తమ అభివృద్ధి సహకారాన్ని బలోపేతం చేసుకుంటూనే ఉన్నందున, ఈ పర్యటన సందర్భంగా ప్రధాని ఇషిబా, ఇతరులతో చర్చించడానికి నేను ఎదురుచూస్తున్నాను. తద్వారా ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాలను మరింతగా పెంచుకోవడానికి మరియు సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించడానికి అవకాశం లభిస్తుంది” అని టోక్యో చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ తెలిపారు.

ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు  ప్రధాని రెండు దేశాల పర్యటన సాగనుంది. తొలుత రెండు రోజులు జపాన్‌లో, ఆ తర్వాత మరో రెండు రోజులు చైనాలో మోదీ పర్యటిస్తారు. ఇందులో భాగంగానే మోదీ గురువారం దిల్లీ నుంచి జపాన్‌కు పయనమయ్యారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఓ ప్రకటన విడుదల చేశారు.

గత 11 ఏళ్లుగా జపాన్‌- భారత్‌ మధ్య సత్సంసంబంధాలు స్థిరంగా, గణనీయమైన పురోగతి సాధించాయి. ప్రస్తుత పర్యటనలో ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడంపై దృష్టి సారిస్తాను. అలాగే ఎస్ సి ఓలో భారత్‌ నిర్మాణాత్మక సభ్యదేశం. ఉమ్మడి సవాళ్లను పరిష్కరించేందుకు, ప్రాంతీయ సహకారాన్ని పెంచుకునే క్రమంలో ఎస్‌సీవో సభ్యదేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉంది. ఈ సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధినేత పుతిన్ తదితరులతో భేటీ అయ్యేందుకు ఎదురు చూస్తున్నాను అని పర్యటనకు బయల్దేరే ముందు మోదీ ఆ  ప్రకటనలో తెలిపారు.

జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు మోదీ ఈ నెల 29, 30 తేదీల్లో రెండు రోజులు అక్కడ పర్యటించనున్నారు. అలాగే భారత్- జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొంటారు. ఈ క్రమంలోనే ఆయన పలువురు ఉన్నతస్థాయి వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులను కలుస్తారు. ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు, స్థిరత్వం కోసం కృషిచేస్తున్న జపాన్‌లో ప్రధాని పర్యటన ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి చెప్పారు.

జపాన్ పర్యటన తర్వాత ఆగస్టు 31, సెప్టెంబర్ 1 రెండు రోజులు మోదీ చైనాలో పర్యటించనున్నాు. ఇందులో తియాన్జిన్‌లో జరిగే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు ప్రధాని హాజరవుతారు. ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసే బాంక్వేట్ విందులోనూ ఆయన పాల్గొంటారు. సరిహద్దుల్లో గల్వాన్ ఘటన తర్వాత ప్రధాని తొలిసారి చైనా పర్యటనకు వెళ్తుడడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్​పై ప్రతీకార సుంకాలతో విరుచుకుపడిన సందర్భంలో ప్రధాని మోదీ, చైనా పర్యటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, భారత్‌పై ట్రంప్​ విధిస్తున్న టారిఫ్​లను ఇటీవల డ్రాగన్ ఖండించింది.

తొలిసారిగా 2015లో మోదీ ప్రధాని హోదాలో బీజింగ్‌కు వెళ్లారు. అలా ఇప్పటివరకు ఐదుసార్లు భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించారు. 2019లో ఆఖరిసారిగా చైనాలో పర్యటించారు. ఆ తర్వాత 2020లో లద్దాఖ్‌ సరిహద్దుల్లో భారత్‌- చైనా సైనికుల మధ్య ఘర్షణతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు కంప్లీట్​గా దెబ్బతిన్నాయి. సత్సంబంధాలను పునరుద్ధరించేందుకు సైనిక, దౌత్యాధికారుల మధ్య అనేక దఫాలుగా ఇప్పటికే చర్చలు జరిగాయి. అందులో రీసెంట్​గా కొంత పురోగతి కనిపిస్తోంది.