
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల వల్ల జరిగే నష్టాన్ని వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలతో భారత్ భర్తీ చేసుకోగలదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మార్కెట్ అధ్యయన సంస్థ ‘బిజినెస్ మానిటర్ ఇంటర్నేషనల్’ (బీఎంఐ) ఈమేరకు అంచనాతో అధ్యయన నివేదికను విడుదల చేసింది. సంస్కరణల్లో భాగంగా జీఎస్టీ రేట్లను భారత సర్కారు గణనీయంగా తగ్గించనుందని, దీనివల్ల 140 కోట్లకుపైగా జనాభాకు నెలవైన భారత్‌లో వస్తు, సేవల వినియోగం పెరిగిపోతుందని బీఎంఐ పేర్కొంది.
ప్రత్యేకించి వాహనాలు, ఆర్థిక సేవలు, సిమెంట్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, నిత్యావసరాల సేల్స్ పెరగొచ్చని తెలిపింది. దీనివల్ల భారత్‌లోని తయారీ/ఉత్పత్తి రంగానికి ఆర్థిక దన్ను లభిస్తుందని విశ్లేషించింది. ఈనేపథ్యంలో ప్రస్తుత దశాబ్దం(2020-2030)లో ఆసియా ఖండంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ స్థానం పదిలంగా ఉంటుందని అంచనా వేసింది. అయితే జీఎస్టీ సంస్కరణల వల్ల కొద్దిపాటి రిస్క్‌ను ఆర్థిక వ్యవస్థ ఎదుర్కోవాల్సి రావచ్చని తెలిపింది.
భారత్‌లోని మరిన్ని రంగాలపై అమెరికా ఇంకా సుంకాలను విధించినా, ఈ దశాబ్దం చివరికల్లా (2030 నాటికి) భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) 6 శాతానికిపైనే ఉండొచ్చని బీఎంఐ పేర్కొంది. భారత్‌పై విధించిన సుంకాలను అమెరికా 25 శాతం నుంచి 50 శాతానికి పెంచినందున, ఇంతకుముందు తాము విడుదల చేసిన జీడీపీ అంచనాల్లో ‘బిజినెస్ మానిటర్ ఇంటర్నేషనల్’ స్వల్ప సవరణ చేసింది.
భారతదేశ జీడీపీ 2025-2026 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతం, 2026-2027లో 5.4 శాతం మేర ఆర్థిక వృద్ధిని సాధించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అమెరికాలా భారత ఆర్థిక వ్యవస్థ కేవలం ఎగుమతులపైనే ఆధారపడి నడవడం లేదు. భారత్‌కు ఆరోప్రాణం దాని దేశీయ వినియోగమే. భారత జీడీపీలో దాదాపు 60 శాతం వాటా దేశ ప్రజల వస్తు,సేవల వినియోగం నుంచే సమకూరుతుంది.
అందుకే అమెరికా లాంటి దేశాలు సుంకాలు విధించినా భారత ఆర్థిక వ్యవస్థ వెంటనే కుదుపులకు గురయ్యే అవకాశాలు తక్కువ. భారతదేశానికి అతిపెద్ద రాబడి వనరు ఆదాయపు పన్ను వసూళ్లే. దీని తర్వాతి స్థానంలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ఉంది. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రాబడిలో 30 శాతం వాటా జీఎస్టీ వసూళ్లదే. భారత జీడీపీలో 2.5 శాతం భాగం కూడా దీనిదే. ఈవివరాలను తమ నివేదికలో ‘బిజినెస్ మానిటర్ ఇంటర్నేషనల్’ (బీఎంఐ) ప్రస్తావించింది.
ట్రంప్ సుంకాల ఒత్తిడిని భారత ఆర్థిక వ్యవస్థ తట్టుకొని బలంగా నిలబడాలంటే జీఎస్టీ సంస్కరణలు అత్యవసరమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం భారత్‌లో 5 శాతం నుంచి 28 శాతం దాకా మొత్తం 4 రకాల జీఎస్టీ శ్లాబ్‌లు ఉన్నాయి. వీటిని 5 శాతం, 18 శాతం అనేది రెండు శ్లాబ్‌లకు కుదించేందుకు భారత ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నిత్యావసరాలన్నీ 5 శాతం శ్లాబ్‌లోనే ఉంటాయని అంటున్నారు. ఒకవేళ ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి దీపావళి కానుకగా జీఎస్టీ సంస్కరణలను అమల్లోకి తెస్తే, 2025-2026 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం జీడీపీలో 0.1 శాతం నుంచి 0.2 శాతం మేర నష్టపోతుందని మార్కెట్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2026-2027లో ఈ నష్టం రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
కేంద్రంలోని మోదీ సర్కారు ఇటీవలే ఆదాయపు పన్ను రేట్లను గణనీయంగా తగ్గించింది. ఓ వైపు ఆదాయపు పన్ను సంస్కరణలు, మరోవైపు జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రజల ఆర్థిక వికాసానికి దన్నుగా నిలవనున్నాయి. ఫలితంగా భారత్‌లో వస్తుసేవల వినియోగం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5.31 లక్షల కోట్లకు పెరగొచ్చని ‘ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్ట్’ తాజాగా అంచనా వేసింది.
ఈ మొత్తం భారతదేశ జీడీపీలో దాదాపు 1.6 శాతానికి సమానమని తెలిపింది. ఇందులో దాదాపు రూ.1.98 లక్షల కోట్లు నిత్యావసర సరుకులపై జీఎస్టీ రేట్ల తగ్గింపుతోనే వస్తాయని పేర్కొంది. జీఎస్టీ తగ్గాక చాలావరకు వస్తుసేవల రేట్లు తగ్గుతాయని, ఫలితంగా భారత ప్రజలు కొనుగోళ్లను పెంచుతారని ‘ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్ట్’ వెల్లడించింది. ఈ పరిణామం వస్తు,సేవల ఉత్పత్తితో ముడిపడిన అన్ని రంగాలకు దన్నుగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
More Stories
అమెరికాలో మొదలైన ‘షట్‌డౌన్’
దసరా, దీపావళి కానుక- ఉద్యోగులకు డీఏ 3 శాతం పెంపు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం