
హెచ్-1బీ వీసా ప్రోగ్రాం మొత్తం ఒక స్కామ్, వీటితో భారతదేశమే ఎక్కువ లబ్ధి పొందుతోందని అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్ రాన్ డీసాంటిస్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వీసాల వ్యవస్థను వాడుకొని భారతీయులు భారీగా సంపాదిస్తున్నారని రాన్ డీసాంటిస్ చెప్పారు. దేశ పౌరులకు ప్రాధాన్యతను ఇవ్వడానికి బదులుగా విదేశీ వర్కర్లపై అమెరికా ఆధారపడాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.
అమెరికన్ పౌరులకు ఉద్యోగ అవకాశాలను పెంచి, వారి సంక్షేమానికి చేయూత అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అమెరికాలోని ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అమెరికన్ వర్కర్ల స్థానంలో విదేశీ కార్మికులను భర్తీ చేసుకునేందుకు హెచ్-1బీ వీసాలను వాడుకుంటున్నారని ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. కంపెనీలు తరచుగా హెచ్-1బీ వీసాదారులతో పాటు అమెరికన్ ఉద్యోగులకు శిక్షణ ఇస్తుంటాయని, అమెరికన్లను తొలగించి, విదేశీ వర్కర్లను తీసుకోవడమే దీని లక్ష్యంగా ఉంటోందని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కంపెనీల ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కావని, వీటివల్ల అమెరికన్ వర్కర్లకు నష్టం జరుగుతోందని ఆయన తెలిపారు. హెచ్-1బీ వీసాల అంశంపై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మంత్రివర్గంలో చీలికపై విలేకరి ప్రశ్నించగా రాన్ డీసాంటిస్ హెచ్-1బీ వీసాల ప్రక్రియను పలు అమెరికా కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని చెప్పుకోవడం కరెక్టుగా ఉంటుందని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో అమెరికన్లను ఉద్యోగాల నుంచి తప్పించి, విదేశీ వర్కర్లను రిక్రూట్ చేసుకునేందుకు హెచ్-1బీ వీసాలను వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
కంపెనీలు యధేచ్ఛగా ఈ వీసాలను రెన్యూవల్ కూడా చేస్తున్నాయని రాన్ డీసాంటిస్ తెలిపారు. హెచ్-1బీ వీసాల ద్వారా ప్రపంచంలోని అత్యుత్తమ ట్యాలెంట్‌ను అమెరికా కంపెనీలు పొందుతున్నాయని కొందరు చెబుతుంటారని, అయితే వాస్తవికత ఇందుకు భిన్నంగా ఉందని చెప్పారు. ఇంతకుముందు ఇదే అంశంపై అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ ప్రస్తుత వీసాల జారీ వ్యవస్థలో మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. ప్రత్యేకించి హెచ్-1బీ వీసా ప్రోగ్రాం, గ్రీన్ కార్డుల జారీ వ్యవస్థల్లో తీవ్ర లోపాలు ఉన్నాయని, వాటిని మార్చాలని సర్కారు భావిస్తోందని వెల్లడించారు.
దేశంలో రూ.43 కోట్లు (5 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టే విదేశీయులకు గోల్డ్ కార్డును జారీచేసి, అమెరికాలో ఉండేందుకు అనుమతిస్తామని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.50 లక్షల మంది అమెరికా గోల్డ్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారని హోవర్డ్ లుట్నిక్ చెప్పారు. వారందరికీ గోల్డ్ కార్డును జారీ చేస్తే, అమెరికాకు దాదాపు 1.25 ట్రిలియన్ డాలర్ల రాబడి వస్తుందని చెప్పారు.
More Stories
పాక్ కు అత్యాధునిక మిస్సైల్స్‌ను సరఫరాకు అమెరికా వ్యతిరేకత
గాజాకు సాయం అందించేందుకు అన్ని సరిహద్దులు తెరవాలి
కాబూల్‌పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?