భారత్ హెచ్చరికతో లక్షా 50 వేల మంది పాక్ ప్రజలు సురక్షితం

భారత్ హెచ్చరికతో లక్షా 50 వేల మంది పాక్ ప్రజలు సురక్షితం
భారత్ పాకిస్థాన్ల మధ్య పహల్గాం ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సింధు నదీ జలాల విషయంపై రెండు దేశాలు పరస్పర ఆరోపణలు, హెచ్చరికలు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే వీటన్నింటిని భారతదేశం పక్కన పెట్టి పాకిస్తాన్ ను మానవతా దృక్పథంతో భారీ వరదలు వస్తాయని హెచ్చరించింది.  ఏక్షణంలోనైనా పాకిస్థాన్ లో సట్లేజ్, చినాబ్, రావి తదితర నదులపై ఉన్న జలాశయాలు గేట్లు ఎత్తబోతున్నామని రెండు రోజుల క్రితమే భారత్ పాకిస్తాన్ కు సూచించింది.
భారత్ హెచ్చరికంతో పాకిస్తాన్ అప్రమత్తం అయింది. ఆ దేశంలోని ప్రావిన్స్ లోని 1.50 లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారత్ అప్రమత్తం చేయడంతోనే తాము బతికాము అంటూ ప్రధాని  మోదీని మెచ్చుకుంటూ పాకిస్తానీయులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రత్యేకంగా భారత ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. గత నెలరోజులుగా పాకిస్థాన్ లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. 
 
ఆకస్మిక వరదల వల్ల వేలల్లో ప్రజలు మృత్యువాతపడ్డారు. ఈ ఏడాది రుతుపవనాల కాలంలో ఖైబర్ పఖుంక్వా ప్రావిన్స్, పంజాబ్, సింధ్ వంటి ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఆగస్టు నెలలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. జూన్లో కురిసిన భారీ వర్షాలకు 800 మందిపైగా ప్రజలు మరణించారు. బునేర్ జిల్లాలోనే ఆకస్మిక వరదల కారణంగా 300 మందికి పైగా చనిపోయినట్లు అధికారులు తెలిపారు. 
 
వాతావరణ మార్పుల వల్లే ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా 2022లో పాకిస్తాన్ మూడింట ఒక వంతు దేశం నీట మునిగింది. కాగా మరోసారి పాకిస్తాన్ కు వరద ముప్పు ఉందని భారత్ అప్రమత్తం చేయడంతో  అసలే తరచూ వర్షాలతో పాకిస్తాన్ ప్రజానీకం చిన్నాభిన్నం అవుతున్న పాక్ తనదేశ పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.