
* మనాలి టోల్ ప్లాజాను ముంచెత్తిన బియాస్ నది
ఈ ఏడాది కుండపోత వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అయింది. ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు 310 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 158 మంది వరదలు, ఫ్లాష్ ఫ్లడ్స్, క్లౌడ్ బరస్ట్ (మేఘాల విస్ఫోటం), పిడుగులు, కొండచరియలు విరిగిపడడం వంటి ప్రకృతి విపత్తుల వల్ల మరణించారు. మిగిలిన 152 మంది భారీ వర్షాల కారణంగా సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు.
ముఖ్యంగా మండి, కంగ్రా, చంబా, కిన్నార్, కులు వంటి జిల్లాల్లో వర్షాల బీభత్సం అత్యధికంగా ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బియాస్ నదితో సహా అనేక వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మనాలిలోని రైసన్ టోల్ ప్లాజాను బియాస్ నదీ ప్రవాహం ముంచెత్తింది. ఆ రహదారి అంతా వరద నీటి మయంగా మారింది. నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఆకస్మిక వరదలకు పలు భవనాలు కూలిపోయాయి. షాపులు, ఇళ్లు కొట్టుకుపోయాయి. రహదారులు తెగిపోయాయి. సోమవారం నుంచి బుధవారం వరకు 12 సార్లు ఆకస్మిక వరదలు సంభవించాయి. లాహౌల్, స్పితి జిల్లాలో తొమ్మిది, కులులో రెండు, కాంగ్రాలో ఒకసారి ఆకస్మికంగా వరదలు వచ్చాయి. చంబాలో కుంభవృష్టి నమోదైంది. రెండు పెద్ద కొండచరియలు విరిగిపడ్డాయి.
భారీ వర్షాలు, వరదలతో ప్రాణ నష్టంతో పాటు, హిమాచల్ ప్రదేశ్‌లో అపారమైన ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఇప్పటివరకు రూ. 2.45 లక్షల కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. వందలాది ఇళ్లు, రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. వ్యవసాయ రంగానికి కూడా భారీ నష్టం వాటిల్లింది. పంటలు పూర్తిగా నాశనం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దశాబ్దాలుగా నిర్మించుకున్న మౌలిక సదుపాయాలు నిమిషాల్లో కొట్టుకుపోవడం ఆ ప్రాంత ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది. రాష్ట్రంలోని చంబా, కాంగ్రా, మండి జిల్లాలకు భారత వాతావరణ శాఖ బుధవారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల వల్ల నీటి మట్టం పెరిగి కొండచరియలు విరిగే పడే అవకాశం ఉందని నివాసితులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
మండి, సిమ్లా, సోలాన్, కుల్లు, మండి, కాంగ్రా, సిమ్లాలలో 30-31 తేదీల్లో ఐఎండి ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. ముఖ్యంగా చాంబా జిల్లాలో భారీ వర్షాలు కురవడం వల్ల నెట్‌వర్క్ లేదు. రోడ్లు ధ్వంసమయ్యాయి. ఇళ్లన్నీ నీటమునిగాయి. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వాలు, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.
=
More Stories
దేశంలో 14 శాతం పెరిగిన వరకట్నం కేసులు
బీహార్ లో తుది ఓటరు జాబితాను విడుదల చేసిన ఈసీ
క్యాన్సర్ పరిశోధనలో భారతీయ కుత్రిమ మేధ