ఎడతెరిపి లేని వర్షాలు.. ఉప్పొంగుతున్న వాగులు

ఎడతెరిపి లేని వర్షాలు.. ఉప్పొంగుతున్న వాగులు
అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో  విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలతో జనానికి అవస్థలు తప్పడం లేదు. వాగులు ఉప్పొంగగా పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీకి క్రమంగా వరద నీరు పెరుగుతోంది. కృష్ణమ్మ ఎగువ నుంచి ఉద్ధృతంగా వస్తోంది.
బ్యారేజీలోకి ప్రస్తుతం 4.3 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఉంది. 69 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి 3.97 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద భారీగా చేరుతుండటంతో ప్రకాశం బ్యారేజ్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పులిచింతల నుంచి వస్తున్న నీరు మరింత పెరిగే అవకాశం ఉంది. అధికారులు కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
నదీ పరివాహక పొలాలలోకి వెళ్లవద్దని ఇప్పటికే సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది. మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 3,10,546 క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం నుంచి 3,62,257 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 26,752 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.  10 స్పిల్ వే గేట్లను 10 అడుగులు ఎత్తి 2,70,190 క్యూసెక్కులు నాగార్జునసాగర్​కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.70 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202.96 టీఎంసీలుగా కొనసాగుతోంది. నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో 26 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.
తెలంగాణాలో భారీగా కురిసిన వర్షాలు ఉమ్మడి మెదక్‌ జిల్లాను అతలాకుతలం చేశాయి. సిద్ధిపేట జిల్లా వర్గల్‌ మండలం గౌరారంలో అత్యధికంగా 23.5 సెంటిమీటర్ల వర్షం కురిసింది. కుండపోత వర్షానికి గౌరారంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్గల్, ములుగు, గజ్వేల్ ప్రాంతాల్లో చెరువు కుంటలు పొంగి పొరడడంతో వర్షం నీరు రహదారులపై చేరి రాకపోకలకు కొంతసేపు ఇబ్బంది ఏర్పడింది.
 
లోతట్టు ప్రాంతాల్లోని పంటపొలాలు పూర్తిగా నీటమునిగాయి. వాగుల ఉద్ధృతికి పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి.  దుబ్బాక మండలంలోని కూడవెల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గజ్వేల్‌ శివారులోని హల్దీ వాగు ఉప్పొంగుతోంది. శివ్వంపేట మండలం పాంబండ వద్ద నిర్మించిన రహదారి కొట్టుకుపోయింది. హల్దీ ప్రాజెక్టు ఉద్ధృతితో కొప్పులపల్లి-హకీంపేట మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నర్సాపూర్ మండలం కాజీపేట గ్రామంలోని మోతుకులకుంటకు భారీగా వరద చేరగా అధికారులు గండికొట్టి నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు. 
 
శివ్వంపేట, నరసాపురం మండలంలో చెరువులు, కుంటలు అలుగులు పోస్తున్నాయి. అల్లాదుర్గంలో బట్టికుంట చెరువు కట్ట తెగడంతో దాదాపు 200 ఎకరాల్లో పంటనీట మునిగింది. మెదక్‌ జిల్లా తూప్రాన్ మండలం దాతర్‌పల్లిలో కట్టు కాల్వ తెగిగ్రామం నుంచి వర్షపునీరు ప్రవహించింది. తూప్రాన్‌లో పలు కాలనీలు జలమయం అయ్యాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వాసర్ వాగులో వరద ఉధృతికి కారు కొట్టుకు పోయింది. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. జోరువానలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
 
భారీ వర్షాలు, వరదల ప్రభావం ఉన్న జిల్లాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గురువారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  కె. రామకృష్ణా రావు వెల్లడించారు. భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న మెదక్, కామారెడ్డి, నిజామాబాద్,  నిర్మల్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు బుధవారం రాత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు.