భారతదేశంపై డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాలు విధించడం అమల్లోకి రావడంతో, ఇటీవలి వారాల్లో అమెరికా అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నాలుగు సార్లు ఫోన్ చేశారని, కానీ భారత నాయకుడు ఆయన కాల్స్‌ను తిరస్కరించారని ఒక జర్మన్ వార్తాపత్రిక పేర్కొంది. మూలాలను ఉటంకిస్తూ, జర్మన్ వార్తాపత్రిక ఫ్రాంక్‌ఫర్టర్ ఆల్గెమైన్ ఇది “ఆయన (మోదీ) కోపం తీవ్రత, అలాగే ఆయన జాగ్రత్త” ఫలితమని పేర్కొంది.
గ్లోబల్ పబ్లిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ (జిపిపిఐ) సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ థోర్‌స్టెన్ బెన్నర్ ‘ఎక్స్’ లో ఈ విషయాన్నీ వెల్లడించారు. ఆయన ఇలా పేర్కొన్నారు: “ట్రంప్ ఇటీవలి వారాల్లో మోదీకి నాలుగుసార్లు కాల్ చేయడానికి ప్రయత్నించారని, కానీ మోదీ ఆ కాల్స్‌ను తిరస్కరించారని ఎఫ్ఏజెడ్ పేర్కొంది.” రష్యా ముడి చమురును కొనుగోలు చేయాలని నిర్ణయించడంతో భారత్ పై 50 శాతం సుంకాలను విధించడంతో గత కొన్ని రోజులుగా భారత్ – అమెరికా మధ్య సంబంధాలు క్షీణించాయని ఆయన తెలిపారు.
“గుర్తుంచుకోండి, భారతదేశం మన మిత్రదేశం అయినప్పటికీ, మనం సంవత్సరాలుగా వారితో చాలా తక్కువ వ్యాపారం చేస్తున్నాము. ఎందుకంటే వారి సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. వారు ఏ దేశంలోనూ లేనంత కఠినమైన, అసహ్యకరమైన ద్రవ్యేతర వాణిజ్య అవరోధాలను కలిగి ఉన్నారు” అని ట్రంప్ విమర్శించారు.
భారతదేశంపై 50 శాతం సుంకాలు విధించాలనే తన నిర్ణయాన్ని ట్రంప్ సమర్ధించుకున్నారు. తరువాత, భారతదేశం అమెరికాపై ఎదురుదాడి చేసింది. ట్రంప్ పరిపాలన చర్యను “అన్యాయం, అసమంజసమైనది” అని పేర్కొంది. దేశ జాతీయ ప్రయోజనాలను, ముఖ్యంగా రైతులు, చిన్న వ్యాపారవేత్తల ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా రైతులు, చిన్న వ్యాపారులను రక్షించడానికి ప్రతిజ్ఞ చేశారు.
“అటువంటి సందర్భంలో, చిన్న వ్యాపారులు, రైతులు, పశువుల పెంపకందారులకు ప్రయోజనం మోదీకి అత్యంత ముఖ్యమైనదని నేను చెప్పాలనుకుంటున్నాను. నా ప్రభుత్వం మీ ప్రయోజనాలపై ఎప్పుడూ రాజీపడదు. ఎంత ఒత్తిడి వచ్చినా, మేము దానిని భరిస్తాము. కానీ, మీ ప్రయోజనాలకు ఎప్పటికీ హాని జరగదు” అని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన భరోసా ఇచ్చారు.
మరోవంక, అమెరికా ఒత్తిడికి తలొగ్గవద్దని, బదులుగా అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించాలని ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సిటీఐ) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సూచించింది. ఈ విధంగా చేస్తే అమెరికా కూడా తమ నిర్ణయాన్ని పునః పరిశీలించే అవకాశం ఉంటుందని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొంది. కేవలం అమెరికా మార్కెట్‌పైనే ఆధారపడకుండా, ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషించాలని కూడా సిటిఐ సూచించింది.
బ్రిటన్, జర్మనీ, మలేషియా, సింగపూర్ వంటి దేశాల మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని, ఆ దేశాలతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని సిటిఐ స్పష్టం చేసింది. ఈ చర్యలు భారత్ తన ఎగుమతులపై అమెరికా ఆధారపడటాన్ని తగ్గించి, వాణిజ్య వైవిధ్యాన్ని పెంచుతాయని తెలిపింది. అమెరికా టారిఫ్‌లు అమలైతే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని ఆ లేఖలో పేర్కొంది.
ముఖ్యంగా లెదర్, టెక్స్టైల్స్, జ్యువెలరీ, ఫార్మాస్యూటికల్స్ వంటి కీలక రంగాలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని సిటిఐ హెచ్చరించింది. ఈ టారిఫ్‌ల వల్ల భారతీయ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో అధిక ధరలకు అమ్ముడవుతాయి, తద్వారా వాటికి డిమాండ్ తగ్గిపోతుంది. ఈ పరిస్థితి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అమెరికా టారిఫ్‌లు భారత్‌కు ఒక సంక్లిష్టమైన సవాలును విసురుతున్నాయి.
కాగా, అమెరికాకు భారత్ ఎగుమతి చేసే వస్తు,సేవలపై 50 శాతం సుంకం బుధవారం ఉదయం నుంచే అమల్లోకి రావడంతో భారత్‌కు చెందిన దాదాపు రూ.4 లక్షల కోట్లు (48.2 బిలియన్ డాలర్లు) విలువైన ఎగుమతులు ప్రభావితం కానున్నాయి. ఈనేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ లోటును మరోచోటు నుంచి పూడ్చుకునేందుకు, కొత్త ఎగుమతి మార్కెట్లను భారత్ సీరియస్‌గా వెతుకుతోంది.
భారతదేశం అమెరికాకు 2025 ఆర్థిక సంవత్సరంలో 86.5 బిలియన్ డాలర్లు విలువైన వస్తు, సేవలను ఎగుమతి చేసింది. వీటిలో మూడింట రెండు వంతుల వస్తు,సేవలపై 50 శాతం అదనపు సుంకాన్ని అమెరికా అమల్లోకి తెచ్చింది. దీంతో భారత్ కొత్తదారులు వెతుక్కుంటోంది. కొత్త మార్కెట్లను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా భారత వాణిజ్య శాఖ రాబోయే 72 గంటల్లో పరిశ్రమ వర్గాల ప్రతినిధులు, వాణిజ్య వర్గాల ప్రతినిధులు, ఇతర దేశాల ప్రతినిధులతో కీలకమైన సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
భారత్ ప్రపంచవ్యాప్తంగా 200కుపైగా దేశాలకు వివిధ వస్తు, సేవలను ఎగుమతి చేస్తుంటుంది. అయితే వీటిలో 40 దేశాలు చాలా కీలకమైనవి. ఎందుకంటే ఈ నలభై దేశాలు భారత్ నుంచి ఏటా 590 బిలియన్ డాలర్లు విలువైన వస్త్రాలు, దుస్తులను దిగుమతి చేసుకుంటాయి. అమెరికా సుంకాల బాదుడుతో తగ్గిపోనున్న ఎగుమతులను కవర్ చేసుకునేందుకు ఈ దేశాల సహకారాన్ని పొందాలని భారత్ భావిస్తోంది.
More Stories
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
రాహుల్ గాంధీ మలేసియా `విహార యాత్ర’పై దుమారం
నిరసనలతో రగిలిపోతున్న నేపాల్… రంగంలోకి సైన్యం