రూ. 12,328 కోట్లతో నాలుగు ప్రధాన రైల్వే ప్రాజెక్టులు 

రూ. 12,328 కోట్లతో నాలుగు ప్రధాన రైల్వే ప్రాజెక్టులు 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం నాలుగు కొత్త రైల్వే ప్రాజెక్టులు, అమెరికాతో వాణిజ్య వ్యవహారాలు, టారిఫ్‌లు, ఆర్థిక ప్రణాళికలపై దృష్టి సారించింది. మొత్తం మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. రూ. 12,328 కోట్ల ఖర్చుతో నాలుగు ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  కచ్‌లోని దూర ప్రాంతాల కలయిక, పర్యాటకానికి ఊపిరినిచ్చేలా ఈ కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారు. 
రణ్‌ ఆఫ్‌ కచ్‌, హరప్పా స్థలం ధోలవిరా, కోటేశ్వర్ ఆలయం, నారాయణ సరోవర్, లాఖ్‌పట్ కోటకు రైలు సదుపాయం కల్పించ సంకల్పించారు. దీని ద్వారా ఈ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో 251 లక్షల మానవ పని దినాల ఉపాధి కలుగుతుంది. ఈ ప్రాజెక్టుల వల్ల బొగ్గు, సిమెంట్‌, స్టీల్‌, కంటైనర్లు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు పెద్ద మేలు జరుగుతుంది. లాజిస్టిక్ ఖర్చులు తగ్గుతాయి.
పర్యావరణ హితం, సిఓ2 ఉద్గారాల నియంత్రణ కలుగుతుంది. కర్ణాటక, తెలంగాణ, బిహార్‌, అసోం రాష్ట్రాలకు మల్టీ-ట్రాకింగ్ ద్వారా కనెక్టివిటీ పెంపు జరుగుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల 13 జిల్లాలు లబ్ధి పొందుతాయి.  565 కిలోమీటర్ల కొత్త రైల్వే మార్గాల కలయిక జరుగుతుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా 360 కోట్ల కిలోల సిఓ2 తగ్గింపు జరుగుతుంది. ఇది 14 కోట్ల చెట్లు  నాటిన దానికి సమానమైన ప్రయోజనం ఇస్తుంది. 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారతీయ ఎగుమతులపై 50% టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో, ఈ సమావేశంలో దీని ప్రభావాలను అంచనా వేసి, తీసుకోవాల్సిన ప్రణాళికల్ని రూపొందించారు.  ప్రధాన మంత్రి స్వనిధి యోజన పునర్వ్యవస్థీకరణ, విస్తరణ గురించి క్యాబినెట్ చర్చించింది. ఈ పథకాన్ని 31 మార్చి 2030 వరకు విస్తరించారు. మొత్తం బడ్జెట్: రూ. 7,332 కోట్లు. ఈ పథకం కింద 1.15 కోట్లకు పైగా వీధి వ్యాపారుల ప్రయోజనం పొందుతారు. ఇది చిన్న వ్యాపారులను ఆత్మనిర్భర్‌గా మార్చడానికి సహాయపడుతుంది. చిన్న వ్యాపారులకు రుణాలు, ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పథకం రూపొందించబడింది.