పత్తిపై దిగుమతులపై సుంకం రాయితీ పొడిగింపు

పత్తిపై దిగుమతులపై సుంకం రాయితీ పొడిగింపు

పత్తిపై సుంకం లేని దిగుమతులను మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలోని టెక్స్‌టైల్స్‌ పరిశ్రమలు ఈ ఏడాది డిసెంబర్‌ చివరి వరకు సుంకం లేకుండా పత్తిని దిగుమతి చేసుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ముడిపత్తిపై 11శాతం దిగుమతి సుంకాన్ని నిలిపివేస్తున్నట్లు కేంద్రం ఆగస్ట్‌ 18న ప్రకటించింది.  ఎగుమతిదారులకు మద్దతు ఇచ్చే చర్యగా, సుంకం లేని దిగుమతిని ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు గురువారం నాటి ప్రకటనలో పేర్కొంది.

భారతదేశ ప్రస్తుత పత్తి సీజన్‌ (2024 అక్టోబర్‌ 1నుండి 2025 సెప్టెంబర్‌ 30 వరకు) సుమారు 40లక్షల బేళ్ల దిగుమతులను ప్రభుత్వం అంచనా వేసింది.  తదుపరి సీజన్‌ (2025 అక్టోబర్‌ 1 నుండి 2026 సెప్టెంబర్‌ 30 వరకు ) కోసం కొత్త పంటరాక దీపావళి తర్వాత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అయితే ముడి పత్తిపై 11 శాతం దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) డిమాండ్‌ చేస్తోంది. 

పత్తికి ఎంఎస్‌పి సి2ప్లస్‌ 50 శాతంతో క్వింటాకు రూ.10,075చొప్పున ప్రకటించాలని, ఆత్మహత్య చేసుకున్న బాధిత రైతు కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ప్రకటించాలని డిమాండ్‌ చేసింది. రైతుల సంక్షేమానికి, వ్యవసాయ రంగానికి నష్టం కలిగించే ఫారిన్‌ ట్రేడ్‌ అగ్రిమెంట్‌ (ఎఫ్‌టిఎ)ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తోంది.