
ఈ బుల్లెట్ రైలు మార్గాల్ని గంటకు గరిష్ఠంగా 350 కి.మీ, సగటున 250 కి.మీ. వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు. హైదరాబాద్- ముంబయి హైస్పీడ్ కారిడార్ డీపీఆర్లో మొత్తం 11 స్టేషన్లను ప్రతిపాదించగా, రాష్ట్రంలో సుమారు 170 కి.మీ. పరిధిలో ఉంటుంది. రాష్ట్రంలో రెండు స్టేషన్లు హైదరాబాద్, జహీరాబాద్ ఉన్నాయి.
కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ ఎఫైర్స్ ఆమోదించిన తర్వాత భూసేకరణ, నిధుల మంజూరు వంటి ప్రక్రియలను మొదలు పెడతారు. దీనితో పాటు చెన్నై, బెంగళూరు మార్గాలను కలిపితే రాష్ట్రంలో హైస్పీడ్ కారిడార్ దూరం 580 కి.మీ.గా ఉండనుంది. హైదరాబాద్ వయా చెన్నై, బెంగళూరు హైస్పీడ్ కారిడార్ తుది సర్వే పనులు చేపట్టిన రైల్వే అనుబంధ రైట్స్ సంస్థ ప్రాథమికంగా ఎలైన్మెంట్లు రూపొందించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను సేకరించిన తర్వాత వాటిని ఖరారు చేస్తారు. ఈ మేరకు సర్వే సంస్థ అధికారులు కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఆయా ప్రతిపాదనలపై చర్చించారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి కాజీపేట, నల్గొండ మీదుగా రెండు పాత రైల్వే మార్గాలు ఉన్నాయి.
అలాగే హైదరాబాద్-విజయవాడ మధ్య జాతీయ రహదారి 65 కూడా ఉంది. ఈ మూడు మార్గాలపై ప్రాథమికంగా చర్చించినట్లు, కాజీపేట మీదుగా అయితే దూరం ఎక్కువ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అయినట్లు తెలిసింది. ఈ లైన్కు జాతీయ రహదారి వెంట గానీ, నల్గొండ మీదుగా గానీ రెండు మార్గాలను పరిశీలించి ఒకదాన్ని ఎంపిక చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరులకు రైలు ప్రయాణ సమయం ఇంచుమించు 12-13 గంటలు పడుతుంది. ఆయా నగరాలను మూడు గంటల్లోనే చేరుకునేలా బుల్లెట్ రైలు ప్రాజెక్టులను డిజైన్ చేస్తున్నారు. హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ను పాత వాటితో సంబంధం లేకుండా పూర్తిగా కొత్త మార్గంలో గ్రీన్ఫీల్డ్ నమూనాలో నిర్మిస్తారు. ఈ మార్గంలో కేవలం బుల్లెట్ రైళ్లే నడుస్తాయి.
ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాలిస్తే హైదరాబాద్ నుంచి ముంబయి, చెన్నై, బెంగళూరుతో పాటు కర్నూలు, విజయవాడ, గుంటూరు నగరాలకు ప్రయాణం మరింత సులభంగా ఉంటుంది. విద్య, ఐటీ, వ్యాపారం రంగాల విస్తరణకు ఈ మార్గాలు ఉపయోగపడతాయని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి