
ఇప్పటికే ప్యాకేజింగ్ పూర్తి చేసుకొని ఓడల్లో అమెరికాకు బయలుదేరిన వస్తువులకు ఈ అదనపు సుంకాల నుంచి మినహాయింపు ఉంటుందని యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. అయితే అవి సెప్టెంబర్ 17నాటికి అమెరికా గోదాములకు చేరాల్సి ఉంది.
అమెరికా కొత్త సుంకాలతో భారతీయ వస్త్రాలు, ముత్యాలు, పగడాలు, ఆభరణాలు, ఆక్వారంగం, తోలు ఉత్పత్తులు, రసాయనాలు, ఎలక్ట్రికల్, మెకానికల్ యంత్రాలపై ప్రభావం పడనుంది. అయితే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే కొన్ని వస్తువులకే 50శాతం సుంకాల నుంచి మినహాయింపు ఉంది. అందులో ఫార్మా, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి.
భారతీయ ఎగుమతులపై అదనపు సుంకాల ప్రభావం 48.2 బిలియన్ డాలర్ల మేర ఉంటుందని వాణిజ్య శాఖ అంచనా వేస్తోంది. అధిక టారిఫ్ల వల్ల జిడిపిపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఇది ఉద్యోగాల కల్పనను దెబ్బతీయనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని, .. ముఖ్యంగా ఎగుమతి హబ్లలోఉద్యోగ రేట్ తీవ్రంగా తగ్గనుందని విశ్లేషిస్తున్నారు.
టెక్స్టైల్స్, రత్నాలు, ఆభరణాలు, సీఫుడ్ వంటి రంగాల్లో భారత ఎగుమతులు 20-30 శాతం తగ్గొచ్చని నిపుణులు, ఎజెన్సీలు అంచనా వేశాయి. ఈ పరిణామాలు కార్పొరేట్ ఆదాయాలు, బ్యాంకులు, ఐటి కంపెనీలపై ఒత్తిడి పెంచనున్నాయి. ఎగుమతులు తగ్గడం, దిగుమతులు పెరగడంతో విత్త లోటు పెరగనుంది.
భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అధిక సుంకాలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ)లకు శరఘాతంగా మారనున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఇఒ) ఇటీవల పేర్కొంది. యుఎస్ మార్కెట్కు వెళ్తున్న మన ఎగుమతులలో దాదాపు 55 శాతం నేరుగా ప్రభావితమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.
ఎంఎస్ఎంఇలు నడిపే అనేక రంగాలకు ఈ ఆకస్మిక వ్యయాలు, టారీఫ్ల పెరుగుదలను భరించడం సాధ్యం కాదని ఆ వర్గాల్లో కలవరం నెలకొంది. ఈ అదనపు దెబ్బ వల్ల ఎగుమతిదారులు దీర్ఘకాల క్లయింట్లను కోల్పోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. యుఎస్ సుంకాలు సుమారు 47.6 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులను నేరుగా ప్రభావితం చేస్తాయి. ఇది భారతదేశ ఎగుమతులలో 55 శాతానికి సమానం. అందులోనూ ఎంఎస్ఎంఇలపై అధిక ప్రభావం ఉండనుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
అధిక టారీఫ్లు టెక్స్టైల్స్, మెరైన్ ఉత్పత్తులు, లెదర్ రంగాల్లోని లక్షలాది మంది ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆ పరిశ్రమ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. టెక్స్టైల్ తయారీలో 40 లక్షల మంది, దుస్తుల ఉత్పత్తిలో 1.11 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని అంచనా. ఈ సుంకాల వల్ల ఆర్డర్లు నిలిచిపోవడానికి తోడు టారిఫ్లు పెరగడం వల్ల ఎంఎస్ఎంఇలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటాయి. ఆయా రంగాల్లో యుఎస్ చర్యలతో భారత్లోని లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
More Stories
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
రాహుల్ గాంధీ మలేసియా `విహార యాత్ర’పై దుమారం
నిరసనలతో రగిలిపోతున్న నేపాల్… రంగంలోకి సైన్యం