
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుంచి జరిగే అవకాశం ఉంది. ఈ నెల 29న మంత్రివర్గ భేటీ నిర్వహించిన తరువాత రోజు నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవల మృతి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు మొదటి రోజు సభలో సంతాపం ప్రకటించనున్నారు.
ఈ సమావేశాల్లోనే ఉపసభాపతి ఎంపిక, కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై వేసిన జస్టిన్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను త్వరలో తెలంగాణ శాసన సభలో ప్రవేశపెడతామని ఆగస్టు 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని, అసెంబ్లీలో చర్చించిన తరువాతే రిపోర్టుపై తుది నిర్ణయం ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
శాసన సభలో చర్చ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలని నిర్ణయిస్తామన్న సీఎం జస్టిస్ ఘోష్ కమిషన్ సూచనల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. అసెంబ్లీలో చర్చల సారాంశం ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్న ఆయన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలోని సలహాలు, సూచనలను ప్రభుత్వం కచ్చితంగా పాటిస్తుందని చెప్పారు.
కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను శాసన సభలో పెట్టి చర్చించిన తరువాత చర్యలు మొదలుపెడతారా? లేదంటే చర్యలు ప్రారంభించి దానికి సంబంధించి అసెంబ్లీలో చర్చిస్తారా? అని ఆగస్టు 22న హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులు దాఖలు చేసిన పిటిషన్‌లపై విచారణలో ఇదే కీలకమని, దీనిపై ఈ స్పష్టత లేకుండా తామేమీ చెప్పజాలమని స్పష్టం చేసింది.
మరోవంక, రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై అధికార, ప్రతిపక్ష నాయకులు వాదోపవాదనలో చేసుకుంటున్నారు. యూరియా కోసం రైతులు పడే కష్టాల గురించి అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. ఇటీవల కురిసిన జోరు వర్షాలకు సాగుపనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతకుముందే నాటేసుకున్న రైతులు ఎరువు కోసం దుకాణాల వద్ద ఎదురుచూస్తున్నారు. అరకొరగా వస్తున్న యూరియా పూర్తిస్థాయిలో అందడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
More Stories
ఆయుర్వేద పద్ధతులను, యోగాను అణచి వేసే కుట్ర
లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క
17 నుంచి `సేవా పక్షం అభియాన్’గా మోదీ జన్మదినం