
భారత పౌరుల జీవితాలతో ఆడుకుంటే కలిగే పరిణామాల గురించి ఆపరేషన్ సిందూర్, ఆపరేషన్ మహదేవ్ల ద్వారా ఉగ్రవాద సూత్రధారులకు స్పష్టమైన సందేశాన్ని పంపామని కేంద్రం హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. “ఆపరేషన్ సిందూర్ ప్రజల్లో సంతృప్తి కలిగించింది. అయితే ఆపరేషన్ మహాదేవ్ ఆ సంతృప్తిని విశ్వాసంగా మార్చింది” అని చెప్పారు. ఆపరేషన్ మహాదేవ్ను విజయవంతంగా నిర్వహించి, పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న టెర్రరిస్టులను తుదముట్టించిన భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బందిని సత్కరిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
“కశ్మీర్లో పర్యాటకం మంచి స్థితిలో ఉన్నప్పుడు, పహల్గాంలో దాడులు చేసి, ‘కశ్మీర్ మిషన్’ పట్టాలు తప్పించడానికి ఉగ్ర సూత్రధారులు విఫలయత్నం చేశారు. అయితే ఉగ్రవాదులు ఎన్ని వ్యూహాలు పన్నినా, ఇకపై వారు భారతదేశాన్ని దెబ్బతీసి, తప్పించుకోలేరని మన భద్రతా దళాలు ప్రపంచానికి చూపించాయి” అని అమిత్ షా గుర్తు చేశారు.
“ఆపరేషన్ మహాదేవ్లో హతమైన ఉగ్రవాదులు, పహల్గాంలో మారణహోమం సృష్టించిన వారేనని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు చెందిన ఫోరెన్సిక్ ల్యాప్ నిర్ధరించింది. భారత పౌరుల హృదయాల్లో భద్రంగా ఉన్నామనే భావాన్ని మరింత బలపరిచిన మన భద్రతా దళాలకు ప్రధాని మోదీ తరఫున, మొత్తం భారతదేశం తరఫున నేను అభినందిస్తున్నాను” అని కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలిపారు.
“సైన్యం, పారామిలటరీ దళాలతో పాటు, జమ్మూకశ్మీర్ పోలీసులు కూడా ఉగ్రవాదంపై పోరులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్, ఆపరేషన్ మహాదేవ్ గురించి అధికార, ప్రతిపక్షాలు అన్నీ ఆనందంగా ఉన్నాయి. ప్రతిఒక్కరూ భద్రతా దళాలకు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ భద్రతపై ఉన్న ఈ నమ్మకమే భారతదేశం అన్ని రంగాల్లో ప్రపంచంలోనే అత్యున్నత స్థానాన్ని సాధించాలనే ఆకాంక్షకు పునాది” అని అమిత్ షా పేర్కొన్నారు.
More Stories
ఓట్ల కోసం చొరబాటుదారులను కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది
ప్రధాని మోదీ, ఆయన తల్లిపై ఏఐ వీడియో కేసు
సరిహద్దుల్లో పరస్పర విశ్వాసం పెంచుకునే దిశగా భారత్ – చైనా