
హిందూ రాష్ట్రం గురించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆలోచన ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరినీ వదిలిపెట్టే ఉద్దేశం కూడా లేదని ఆ సంస్థ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు. సంఘ్ భిన్నమైన అభిప్రాయం కలిగి ఉండటం “నేరం కాదు” అని, ఆర్ఎస్ఎస్, దాని స్వయంసేవకుల మధ్య నిరంతరం కమ్యూనికేషన్ ఉన్నప్పటికీ, వారు “క్రమంగా స్వతంత్రులు అవుతారు, వారికి సంఘ్ అవసరం లేదు” అని తెలిపారు.
“మనం హిందూ రాష్ట్రం గురించి మాట్లాడేటప్పుడు ప్రశ్నలు తలెత్తుతాయి. మనం హిందూ రాష్ట్రం అని చెప్పినప్పుడు, మనం ఎవరినీ వదిలిపెట్టబోతున్నామని కాదు. లేదా మనం ఎవరినీ వ్యతిరేకిస్తున్నామని కాదు. సంఘ్ అలాంటిది కాదు. సంఘ్ ప్రతిచర్య లేదా వ్యతిరేకత నుండి పుట్టలేదు,” అని భగవత్ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో మంగళవారం సాయంత్రం ప్రసంగిస్తూ స్పష్టత ఇచ్చారు.
“100 సంవత్సరాల సంఘ్ ప్రయాణం – న్యూ హారిజన్స్” అనే శీర్షికతో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన మూడు రోజుల శతాబ్ది ఉపన్యాస శ్రేణిలో భగవత్ భారతదేశం, సంస్థ కోసం ముందుకు సాగే మార్గంపై సంఘ్ అభిప్రాయాలను విస్తరిస్తున్నారు. “హిందూ రాష్ట్రం” కి రాజకీయ అధికారంతో సంబంధం లేదని పేర్కొంటూ 40,000 సంవత్సరాలకు పైగా ఒకే డీఎన్ఏను పంచుకునే” “అఖండ భారత్” విశాలమైన భూభాగంలో నివసిస్తున్న ప్రజలను “బయటి వ్యక్తులు” హిందువులుగా పిలుస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
“హిందూ రాష్ట్ర ప్రాముఖ్యతతో కూడిన పాలన ఉన్నప్పుడల్లా, అది మతం, విశ్వాసంతో సంబంధం కలిగి ఉండేది కాదు. అందరికీ సమాన న్యాయం ఉంటుంది, వివక్షత ఉండదు,” అని ఆయన తేల్చి చెప్పారు. ఒక గ్రామంలో ముస్లింలు, క్రైస్తవులు లేనప్పుడు సంఘ శాఖ ఎందుకు అవసరమని అడిగినప్పుడు, ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ రెండవ సర్ సంఘచాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ చెప్పిన ఒక కథను భగవత్ ఈ సందర్భంగా వివరించారు. మొత్తం ప్రపంచంలో ముస్లింలు లేదా క్రైస్తవులు లేకపోయినా, హిందూ సమాజాన్ని నిర్వహించడానికి శాఖలు అవసరమని గోల్వాల్కర్ బదులిచ్చారు.
ఒక హిందువు ఎల్లప్పుడూ అందరినీ కలుపుకొని ఉంటాడు. వైవిధ్యాన్ని గౌరవిస్తాడు. ఇది ఐక్యతకు మూలం అని భగవత్ చెప్పారు. “ఒక హిందువు ఒకే దేవుడిని నమ్మడు. అతనికి అనేక రూపాలు ఉన్నాయి. అతనికి 33 కోట్ల రూపాలు ఉన్నాయని చెబుతారు. ఒకే గ్రంథం లేదా ఒక గురువు కాదు. బౌద్ధులు, జైనులు, శైవులు చాలా మంది ఉన్నారు … అనేక మతాలు ఉన్నాయి” అని ఆయన గుర్తు చేశారు.
“కానీ వీటన్నింటినీ, అన్ని రకాల పూజలను అంగీకరించే స్వభావం ఉంది. అన్నీ ఒకే స్థానానికి చేరుకుంటాయి. ఏ మార్గం తప్పు మార్గం కాదు … హిందూ అంటే హిందూ వర్సెస్ అన్నీ కాదు. హిందూ అంటే అందరినీ కలుపుకోవడం. కలుపుకోవడం అనే దానికి పరిమితులు లేవు.`మీ మార్గాన్ని అనుసరించండి, దానిని మార్చకండి, ఇతరులను మార్చడానికి ప్రయత్నించకండి. కానీ ఇతరుల విశ్వాసాన్ని గౌరవించండి. దానిని అగౌరవపరచకండి. విశ్వాసం కోసం పోరాడకండి. కలిసి ఉండండ’ అటువంటి సంప్రదాయాలు, సంస్కృతి ఉన్నవాడు హిందువు, ”అని భగవత్ వివరించారు.
భగవత్ హిందువులను నాలుగు వర్గాలుగా విభజించి, దేశ వైవిధ్యం దాని ఐక్యతకు ఆటంకం కలిగించదని పేర్కొన్నారు. “హిందువులలో నాలుగు వర్గాలు ఉన్నాయి – తమను తాము హిందువులుగా భావించుకుని దానిలో గర్వించేవారు, తమను తాము హిందువులుగా భావించుకుని దానిలో గర్వించనివారు, తాము హిందువులమని తెలిసి కూడా దాని గురించి ప్రస్తావించనివారు, తమను తాము హిందువులుగా భావించనివారు” అని ఆయన వివరించారు.
భారతదేశంలో నివసించే వారందరూ తమ ఉమ్మడి వంశపారంపర్యత, ఉమ్మడి సంస్కృతి కారణంగా హిందువులే అని సూచిస్తూ, ఇలా అన్నారు, “ఐక్యంగా ఉండటానికి మనం ఏకరీతిగా ఉండాలని మేము నమ్మము. వైవిధ్యం కూడా ఐక్యతను కలిగి ఉంటుంది. కానీ మనం పరీక్షలో ముందుగా సులభమైన ప్రశ్నలను పరిష్కరించుకుంటాము. కాబట్టి, తమను తాము హిందువులుగా పిలుచుకునే వారిని వ్యవస్థీకరించండి. వారి జీవితాలను మెరుగుపరచుకోండి. ఆ తర్వాత, ఏదో కారణం చేత తమను తాము హిందువులుగా పిలుచుకోని వారు అలా చెప్పడం ప్రారంభిస్తారు. అది జరగడం ప్రారంభమైంది.”
భగవత్ అభిప్రాయ భేదాల గురించి కూడా ఒక సందేశాన్ని ఇచ్చారు. “మీలో చాలామంది ఆర్ఎస్ఎస్ ని ఇష్టపడకపోవచ్చు. ఇప్పుడు దానిని ఇష్టపడి ఉండవచ్చు. భిన్నమైన అభిప్రాయం లేదా దృక్పథాన్ని కలిగి ఉండటం నేరం కాదు. ఇది ప్రకృతి ఇచ్చిన ధర్మం. మనం విభిన్న అభిప్రాయాలను విని ఏకాభిప్రాయానికి చేరుకున్నప్పుడు, మనం అభివృద్ధి చెందుతాము.”
భగవత్ తన ప్రసంగంలో, బిజెపితో ఆర్ఎస్ఎస్ సంబంధాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. సంఘ్ స్వయంసేవకులను “రిమోట్ కంట్రోల్” చేయదని ఆయన స్పష్టం చేశారు. “సంఘ్, స్వయంసేవకుల మధ్య నిరంతరం కమ్యూనికేషన్ ఉన్నప్పటికీ, వారు “క్రమంగా స్వతంత్రులు అవుతారు. సంఘ్ అవసరం లేదు” అని ఆర్ఎస్ఎస్ చీఫ్ పేర్కొన్నారు.
“స్వయంసేవకులు పనిచేసేది తమ కార్యరంగంలో. అది స్వతంత్రమైనది, స్వయంప్రతిపత్తి కలిగినది. దాని ఘనత వారికే చెందుతుంది. సంఘ్ కూడా అపఖ్యాతిని పంచుకుంటుంది. ఎందుకంటే అది మా ఉత్పత్తి. సంఘ్ వారిని ప్రత్యక్షంగా లేదా రిమోట్‌గా నియంత్రించదు. కానీ సంఘ్‌తో స్వయంసేవకుల సంబంధం విడదీయరానిది. అందుకే, వారు మాతో మాట్లాడతారు, మేము వారితో మాట్లాడుతాము. వారు మమ్ముల్ని అడుగుతారు, మేము వారికి చెబుతాము. మేము ఏదైనా గమనిస్తే మేము వారికి చెబుతాము. వారు సహాయం అడిగితే, మేము అందిస్తాము. కానీ వారు మా మాట వినాలని వారిపై ఎటువంటి ఒత్తిడి లేదు,” అని ఆయన వివరించారు.
“వారు మా అభిప్రాయాలను అర్థం చేసుకుంటారు. వారు ఏమి చేయాలనుకుంటున్నారో అది చేస్తారు. వారి రంగంలో వారికి నైపుణ్యం ఉంటుంది. మాకు నైపుణ్యం లేదని కాదు, కానీ వారు దానిని చేయాలి. ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి స్వాతంత్ర్యం ఉండాలి. సంస్థలో, వారితో స్వయంసేవకులు మాత్రమే ఉండరు, ప్రజలను సూచించే ఇతరులు కూడా ఉన్నారు, ”అని ఆయన పేర్కొన్నారు.
డా. భగవత్ ఒక సంస్థ ఎలా పనిచేయాలో వివరించారు. “మేము స్వయంసేవకులను అందరినీ తమతో తీసుకెళ్లమని నేర్పించాము. అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, కానీ అది ఆగ్రహంగా మారకూడదు. ఒక సంస్థ అంటే అదే. వారి నుండి మనం ఆశించేది ఏమిటంటే సంస్థ, కార్యకర్తలు సరిగ్గా పనిచేయాలి. వారు తమ పనిని చేస్తూనే ఉంటారు, మేము వారికి చెబుతూనే ఉంటాము. క్రమంగా, వారు స్వతంత్రంగా, స్వయంప్రతిపత్తిగా, స్వయం సమృద్ధిగా మారతారు. వారికి ఇక సహాయం అవసరం లేదు. స్వయంసేవక్ ఆలోచనలు, ప్రవర్తన, విలువలు సరైన స్థితిలో ఉండటమే మా ఆందోళన” అని తెలిపారు.
ఈ ఉపన్యాస శ్రేణి ద్వారా ఆర్ఎస్ఎస్ తన గురించి సరైన, ప్రామాణికమైన సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటుందని భగవత్ చెప్పారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో, తరువాత దేశం ప్రయాణం గురించి కూడా ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్యం తర్వాత “సైద్ధాంతిక జ్ఞానోదయం” అనే పాత్రను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆయన ఆరోపించారు.
రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, దౌత్యవేత్తలు, సామాజిక కార్యకర్తలు సహా అన్ని రంగాల నుండి దాదాపు 1,300 మంది ఈ ప్రసంగంపై హాజరయ్యారు. చైనా, అమెరికా, రష్యాతో సహా 25 దేశాల నుండి దౌత్యవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, అనుప్రియ పటేల్, బిజెపి ఎంపి కంగనా రనౌత్, శివసేన ఎంపి శ్రీకాంత్ షిండే, ఎన్‌డిఎ మిత్రుడు ఉపేంద్ర కుష్వాహా ఈ కార్యక్రమానికి హాజరైన రాజకీయ నాయకులలో ఉన్నారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తులు జె ఎస్ ఖేహర్, రంజన్ గొగోయ్, కొంతమంది ఆర్మీ మాజీ చీఫ్‌లు కూడా ప్రేక్షకులలో ఉన్నారు.
More Stories
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
ఇది ప్రతి భారతీయుడి విజయం
రాహుల్ గాంధీ మలేసియా `విహార యాత్ర’పై దుమారం