
హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా జిల్లాలోని ధూప్‌సింగ్ తండా జలదిగ్బంధమయ్యింది. తండాను వరద నీరు ముంచెత్తడంతో ఇండ్లలోకి వాన నీరు చేరుకుంది. ఇండ్లు నీట మునగడంతో తమను కాపాడాలంటూ స్థానికులు బిల్డింగ్‌పైకి ఆర్తనాదాలు చేస్తున్నారు.
ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కుండపోత వర్షం బీభత్సం సృష్టిస్తోంది. చెరువుల నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తుండటంతో ఎక్కడికక్కడ రోడ్లు, కల్వర్టులు తెగిపోయాయి. వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి ఇసుక మేటలు వేసింది. ఇళ్లలోకి నీరు చేరి నిత్యవసరాలు తడిసి ముద్దయ్యాయి. లోలెవల‌్ వంతెనలపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
నల్గొండ జిల్లాలోనూ తెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. రహదారులపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి రాకపోకలు నిలిపివేశారు.
కామారెడ్డి -భిక్కనూర్ మార్గంలో ట్రైన్ పట్టాల కింద వరద పోటెత్తడంతో భారీ గండిపడింది. దీంతో అధికారులు ట్రైన్ల రాకపోకలను నిలిపివేశారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. భారీ వర్షాలపై తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నదులు, వాగులపై ఉన్న లోతట్టు కాజ్‌వేలు, కల్వర్టులపై నుంచి నీటి ప్రవాహాలు ఉంటే అక్కడ రాక పోకలు నిషేధించాలని సీఎం ఆదేశించారు
మరోవైపు అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో రానున్న ఐదురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రాబోయే 2 గంటల్లో 8 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిన్న రాత్రి నుండే తెలంగాణలో కుండపోత వాన కురుస్తోంది. హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మిగతా 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లల్లో సురక్షితంగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు వినాయక మంటపాలకు వెళ్లేటపుడు తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో లైటింగ్ సెట్లు, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి