ఖైరతాబాద్ వినాయకుడికి తొలి పూజ చేసిన గవర్నర్

ఖైరతాబాద్ వినాయకుడికి తొలి పూజ చేసిన గవర్నర్
తెలంగాణ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్ బడా గణేషుడికి దర్శించుకోవడానికి భక్తులు వర్షంలో కూడా తండోపతండాలుగా తరలివస్తున్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఖైరతాబాద వినాయకుడికి తొలిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంఎల్‌ఎ దానం నాగేందర్, కాంగ్రెస్ నేతలు, పూజారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సంవత్సరం బడా గణేషుడిని శ్రీ విశ్వశాంతి మహా గణపతిగా దర్శనమిస్తున్నారు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని తీర్చిదిద్దారు. గణేషుడికి కుడివైపు శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు, ఎడమ వైపున ఖైరతాబాద్ గ్రామ దేవత గజ్జలమ్మ ఉన్నారు. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించేందుకు భక్తులు బుధవారం తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. ఈ సందర్భంగా మహా గణపతిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ గర్భిణీ క్యూలైన్‌లోనే ప్రసవించింది.

ఖైరతాబాద్ మహా గణనాథుడి తొలిపూజ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రసవించిన మహిళను రాజస్థాన్‌కు చెందిన రేష్మగా గుర్తించారు. ప్రసవం అనంతరం గణేశ్ ఉత్సవ నిర్వాహకులు.. మహిళను పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

వినాయక చవితిని పురస్కరించుకుని అత్యంత ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్​ గణేశ్​ దేవాలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం నిర్వహిస్తున్నారు. గణనాథుడి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందలు లేకుండా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.

గణపతి నవరాత్రుల నేపథ్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.  బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. అమ్మవారిని, వినాయకుడిని గడ్డి, రకరకాల పుష్పాలతో అలంకరించారు. ఉదయం నుంచి వేదపండితులు అమ్మవారికి అభిషేకాలు చేసి ధూప దీప నైవేధ్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడు-గడ్డి అలంకరణతో మెరిసిన అమ్మవారి రూపం భక్తులకు కనువిందు చేస్తోంది. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక అలంకరణలో దర్శించి తిలకించారు. అన్నప్రసాదాలను పంపిణీ చేశారు.

 పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణనాథులను పూజించాలని కాంగ్రెస్​ యువ నాయకుడు సంతోష్​ యాదవ్​ పేర్కొన్నారు. మారేడుపల్లిలోని అపార్ట్​మెంట్​ వాసులకు ఉచితంగా మట్టి గణపతుల విగ్రహాలను ఆయన పంపిణీ చేశారు. పర్యావరణహితంతో పాటు కాలుష్య నియంత్రణకు మట్టి గణనాథులను పూజించే సంస్కృతి పెరుగుతుండటం మంచి పరిణామమని అపార్ట్​మెంట్​ వాసులు తెలిపారు.