
వేతన నియమావళి, సామాజిక భద్రతా నియమావళిని వెంటనే అమలు చేయాలని దేశంలో అతిపెద్ద కార్మిక సంఘమైన భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది, ముఖ్యంగా అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమానికి ఇవి కీలకమైన చారిత్రాత్మక చట్టాలు అని పేర్కొంది. ఆగస్టు 22 నుండి 24 వరకు భోపాల్‌లో జరిగిన బిఎంఎస్ 159వ కేంద్ర వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించబడిన తీర్మానంలో భారత ప్రభుత్వం, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ, భారత కార్మిక సమావేశం (ఐఎల్సి) అత్యవసరంగా సమావేశమై పెండింగ్‌లో ఉన్న కోడ్‌లను త్వరగా అమలు చేయాలని కోరింది.
బిఎంఎస్ అధ్యక్షుడు హిరణ్మయ్ పాండ్య అధ్యక్షత వహించగా, ప్రధాన కార్యదర్శి రవీంద్ర హిమ్టే ఈ కార్యక్రమాలను నిర్వహించారు. వేతన, సామాజిక భద్రతా నియమావళి కార్మికులకు, ముఖ్యంగా అసంఘటిత రంగంలోని వారికి ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో రూపొందించబడిన చారిత్రాత్మక చట్టాలు. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్‌ను మినహాయించడాన్ని భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యతిరేకించింది. వాటి అమలును ఆలస్యం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరింది.
కార్మిక సమస్యలపై అత్యున్నత నిర్ణయం తీసుకునే సంస్థ అయినప్పటికీ, 2015 నుండి జరగని ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ (ఐ ఎల్ సి) సమావేశం ప్రాముఖ్యతను బిఎంఎస్ ఈ సందర్భంగా ప్రస్తావించింది. కౌశల్ వికాస్ యోజన కింద కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించడానికి హర్యానా ప్రభుత్వం తీసుకున్న చర్యను స్వాగతించింది. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీకి కృతజ్ఞతలు తెలిపింది.
ఐసిడిఎస్ పథకం కింద అంగన్‌వాడీ కార్మికుల కోసం ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్)పై వేధింపులు, ఆచరణాత్మక ఇబ్బందులను పేర్కొంటూ ఆందోళన వ్యక్తం చేసింది. బిఎంఎస్ దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. బిఎంఎస్ 20వ అఖిల భారత సమావేశం ఫిబ్రవరి 2026లో పూరిలో జరుగుతుందని, 42 పారిశ్రామిక సమాఖ్యలు, 28 రాష్ట్ర యూనిట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న 2,500 మంది ప్రతినిధులు పాల్గొంటారని ప్రకటించింది.
More Stories
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు
ఇది ప్రతి భారతీయుడి విజయం