
రాష్రాల బిల్లులకు ఆమోదం తెలియచేయడంలో గవర్నర్లు, రాష్ట్రపతికి ఉన్న స్వయం ప్రతిపత్తిని బీజేపీ పాలిత రాష్ట్రాలు గట్టిగా సమర్థించాయి. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లుల కేసులో తీర్పు చెప్పినట్లుగా సమ్మతి ఇచ్చినట్లే భావించాలన్న పేరుతో న్యాయస్థానాలు తీర్పు చెప్పలేవని ఆ రాష్ర్టాలు స్పష్టం చేశాయి. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లుల విషయంలో రాష్ట్రపతికి, గవర్నర్లకు నిర్దిష్ట కాలపరిమితులు విధించవచ్చా? లేదా? అనే అంశమై స్పష్టత నివ్వాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ద్రౌ ముర్ము అత్యున్నత న్యాయస్థానానికి పంపిన ప్రశ్నలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం కూడా తన విచారణను కొనసాగించింది.
రాష్ట్ర బిల్లులకు సమ్మతి కోసం రాష్ట్రపతికి గడువు విధించడంపై ధర్మాసనం రాజ్యాంగంలోని 200 అధికరణను వివరించడం సమస్యాత్మకంగా అభివర్ణించింది. రాష్ట్ర అసెంబ్లీకి వాపసు చేయకుండా ఓ బిల్లును పెండింగ్లో పెట్టే స్వతంత్ర అధికారం గవర్నర్లకు ఉందని ఈ అధికరణ వివరిస్తోందని ధర్మాసనం పేర్కొంది. 2020లో ఓ బిల్లు ఆమోదం పొందింది. 2025లో కూడా ఆ బిల్లుకు సమ్మతి రాకపోతే న్యాయస్థానాలకు జోక్యం చేసుకుని గవర్నర్లకు ఆదేశాలు ఇచ్చే అధికారం లేనట్లేనా? అని ధర్మాసనం బీజేపీ పాలిత రాష్ర్టాల తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.
గవర్నర్లకు ఆ అధికారాలే ఉంటే ద్రవ్య బిల్లులను కూడా పెండింగ్లో ఉంచవచ్చని, అప్పుడు పరిస్థితి సమస్యాత్మకం కాగలదని అభిప్రాయపడింది. అయితే ఆ పరిస్థితి రాదని, ఆర్టికల్ 207 కింద గవర్నర్ సిఫార్సు మేరకే ద్రవ్య బిల్లులను సభలో ప్రవేశపెట్టడం జరుగుతుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తూ రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలిపే పూర్తి అధికారాలు గవర్నర్లకు, రాష్ట్రపతికి మాత్రమే ఉన్నాయని చెప్పారు.
సమ్మతి తెలిపినట్లే అన్న భావనే లేదని ఆయన వాదించారు. తమ అధికారాలు, బాధ్యతల నిర్వహణకు సంబంధించి గవర్నర్లు, రాష్ట్రపతి ఏ కోర్టులకూ జవాబుదారీ కాదని ఆర్టికల్ 361ని ఉటంకిస్తూ సాల్వే తెలిపారు. మీ నిర్ణయం ఏమిటని మాత్రమే కోర్టు అడగగలదే తప్ప ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించలేదని సాల్వే స్పష్టం చేశారు.
మహారాష్ట్ర, గోవా, హర్యానా, చత్తీస్ ఘడ్, పుదుచ్చేరి సహా ఎస్ఎ పాలనలో వున్న రాష్ట్రాల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ, ఇలా కాలపరిమితిని విధించడం రాజ్యాంగ సంస్థకు ఇచ్చిన విచక్షణా అధికారాల స్ఫూర్తికి వ్యతిరేకమని వాదించారు. తిరిగి ఈ కేసుపై విచారణను 28వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజున ప్రతిపక్ష పార్టీలు తమ వాదనలు వినిపిస్తాయని భావిస్తున్నారు.
More Stories
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు
ఇది ప్రతి భారతీయుడి విజయం
నేపాల్ సుస్థిరత భారత్కు ఎంతో కీలకం