సుదర్శన చక్ర వైమానిక రక్షణ వ్యవస్థను రూపొందించేందుకు త్రివిధ దళాల సహకారం అవసరం ఉంటుందని విధ దళాధిపతి అనిల్ చౌహాన్ తెలిపారు. త్రివిధ దళాల మిలిటరీ సర్వీసులను బలోపేతం చేయాల్సి ఉంటుందని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని ఆర్మీ వార్ కాలేజీలో రణ్ సంవాద్ అనే అంశంపై జరిగిన కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ సుదర్శన చక్ర రక్షణ మిస్సైళ్లు, నిఘా వ్యవస్థలను బలోపేతం చేస్తేనే శత్రుదుర్భేద్యమైన వ్యూహాత్మక రక్షణ వ్యవస్థ రూపొందించడం వీలు అవుతుందని స్పష్టం చేసారు.
ఇజ్రాయిల్‌కు చెందిన రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ తరహాలోనే సుదర్శన చక్ర తయారు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని రకాల వాతావరణాల్లో పనిచేసే రీతిలో సుదర్శన చక్ర ఉంటుందని, సమర్థవంతంగా మిస్సైళ్లను అడ్డుకుంటుందని వివరించారు. యుద్ధంపై సాంకేతికత ప్రభావం అన్న థీమ్‌పై సీడీఎస్ కీలక ప్రసంగం చేస్తూ భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలకు సరిహద్దులు ఉండవని చెప్పారు.
అన్ని డోమెయిన్ల మధ్య సంయుక్త స్పందన అవసరం అని చెబుతూ సంయుక్తంగా అన్ని రంగాల్లో శిక్షణ పొందాలని చౌహన్ సూచించారు. ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్, క్వాంటమ్ విధానాలకు పెద్ద పీట వేయాల్సి వస్తుందని తెలిపారు. భారతదేశ సైనిక శక్తిని పెంపొందించడానికి సన్నాహాల్లో భాగంగా మూడు దళాల మధ్య ఎక్కువ సమన్వయం అవసరమని సీడీఎస్ నొక్కిచెప్పారు.
భూమి, సముద్రం, గాలి, సైబర్, అంతరిక్షంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో మన ప్రతిస్పందన ఏకీకృతంగా, వేగంగా, నిర్ణయాత్మకంగా ఉండాలని తెలిపారు. భవిష్యత్ యుద్ధభూమి సేవా సరిహద్దులను గుర్తించదని, దీనికి ఉమ్మడి ఆలోచన, ఉమ్మడి ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు. దేశం సాంకేతికతలో మాత్రమే కాకుండా ఆలోచనల్లో, ఆచరణలో కూడా స్వతంత్రంగా మారాలని అనిల్ చౌహాన్ అభిప్రాయపడ్డారు.
సిద్ధాంత, ఆచరణాత్మక అంశాలపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఒక వికసిత్ భారత్‌గా, ‘శశాస్త్ర’, ‘సురక్షిత’, ‘ఆత్మనిర్భర్’ లాగా ఉండాలని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ఇప్పటికీ కొనసాగుతోందని చెబుతూ పాకిస్థాన్‌తో ఘర్షణ నుంచి భారత్ విలువైన పాఠాలు నేర్చుకుందని తెలిపారు. అవన్నీ అమల్లో ఉన్నాయని చెప్పారు. భారత్ శాంతిని ప్రేమించే దేశమని, కానీ దాన్ని తప్పుగా భావిస్తే పరిణామాలు వేరేగా ఉంటాయని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. ఎల్లప్పుడూ శాంతివాదులు కాలేమని, అవసరమైనప్పుడల్లా తిరిగి దాడి చేయడానికి దేశం సంసిద్ధంగా ఉంటుందని చెప్పారు.
‘మీరు శాంతిని కోరుకుంటే, యుద్ధానికి సిద్ధం’ అనే లాటిన్ కోట్‌ను ప్రస్తావించారు. “ఈ సెమినార్ శక్తిని ప్రదర్శించడం గురించి కాదు. భాగస్వామ్య కార్యాచరణ అవగాహనను రూపొందించడం గురించి. కలిసి పోరాడటానికి మాత్రమే కాకుండా కలిసి ఆలోచించడానికి కూడా మనం సిద్ధం కావాలి” అని ఆయన సూచించారు. రణ్ సంవాద్ సైనిక నిపుణులను వ్యూహాత్మక సంభాషణలో ముందుకు తీసుకువస్తుందని తెలిపారు.

More Stories
మూడు దేశాల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
అన్ని పార్టీల అధ్యక్షులకంటే చిన్నవాడు నితిన్ నబిన్
సిడ్నీ ఉగ్రదాడిలో పాక్ సంతతి తండ్రి, కొడుకులు