
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు మరికొన్ని గంటల్లో అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో అధికారికంగా అమెరికా తాజాగా భారత్‌కు నోటీసులు పంపింది. వాషింగ్టన్ కాలమానం ప్రకారం, ఆగస్టు 27వ తేదీ ప్రారంభమయ్యే అర్ధరాత్రి 12.01 గంటల నుంచి (అంటే భారత కాలమానం ప్రకారం ఆగస్టు 27 ఉదయం 10 గంటల ప్రాంతంలో) సుంకాలు అమల్లోకి వస్తాయని అగ్రరాజ్యం తెలిపింది.
అప్పటి నుంచి అమెరికాలోకి ప్రవేశించే భారత ఉత్పత్తులకు 50 శాతం టారిఫ్‌లు వర్తిస్తాయని వెల్లడించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తమ నోటీసుల్లో పేర్కొంది. కాగా, భారత్‌పై గతంలో ట్రంప్, 25 శాతం సుంకాలు విధించారు. అవి ఆగస్టు 7 నుంచే అమల్లోకి వచ్చాయి. ఆ తర్వాత రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో మరో 25 శాతం అదనపు టారిఫ్‌లను విధిస్తున్నట్లు ఇటీవల ట్రంప్ ప్రకటించారు. దీంతో భారత్‌పై మొత్తం సుంకాలు 50 శాతానికి పెరిగాయి.
ట్రంప్ టారిఫ్‌లతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే తీవ్ర ప్రభావం పడనుంది. భారత్ నుంచి ఎగుమతయ్యే అతి కొద్ది వస్తువులకే ఈ అధిక సుంకాల నుంచి మినహాయింపు ఉంది. కాగా, అమెరికా అదనపు సుంకాలపై ఇప్పటికే భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది అనుచితం, అన్యాయం, అహేతుకమని తెలిపింది. ఆ విషయంలో తాము ఎప్పుడూ దేశ ప్రయోజనాలకు కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
ప్రధాని నరేంద్ర మోదీ రైతులు, పశుపోషకులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నని తేల్చిచెప్పారు. కాగా, అమెరికా విధించిన భారీ సుంకాలు ప్రభావాన్ని ఎదుర్కొంటున్న భారతీయ ఎగుమతిదారుల కోసం తీసుకుంటున్న చర్యలను సమీక్షించేందుకు ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) మంగళవారం ఓ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నది. ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి ఈ సమావేశానికి అధ్యక్షత వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అమెరికా విధించిన 50 శాతం సుంకాలు అమలులోకి వస్తే వ్యవసాయం, ఫార్మా, జౌళి, చర్మ ఉత్పత్తులపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎగుమతులపైనే ఆధారపడిన పరిశ్రమలు, చిన్న, మధ్యతరహా సంస్థ(ఎస్ఎంఈలు)లపైనే ప్రధానంగా దృష్టి సారించాలని ప్రభుత్వ వ్యూహమని అధికారులు తెలిపారు. మంగళవారం జరిగే సమావేశంలో ఎగుమతిదారులకు ఎలాంటి భరోసా కల్పించాలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
More Stories
పాక్‌లో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన
దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో నటుడు విశాల్ బ్రహ్మ అరెస్ట్