ఎంత ఒత్తిడి వచ్చినా.. రైతులకు హాని జరగనివ్వం

ఎంత ఒత్తిడి వచ్చినా.. రైతులకు హాని జరగనివ్వం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాలపై ప్రధాన మంత్రి ప్రధాని నరేంద్ర మోదీ  మరోసారి పరోక్షంగా స్పందిస్తూ ‘ఎంత ఒత్తిడి వచ్చినా.. రైతులకు హాని జరగనివ్వం’ అని స్పష్టం చేశారు. సోమవారం అహ్మదాబాద్ లో రూ.5,400 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల పనులను ప్రారంభిస్తూ ఎంత ఒత్తిడి వచ్చినా తమ ప్రభుత్వం తట్టుకునే బలాన్ని పెంచుకుంటూనే ఉంటుందని తెలిపారు. 

చిన్న పారిశ్రామికవేత్తలు, రైతులు, పశుపోషకులకు ఎటువంటి హాని జరగనివ్వదని ఆయన భరోసా ఇచ్చారు. “ఈ అహ్మదాబాద్ గడ్డ మీద నుంచి చెబుతున్నా చిన్న పారిశ్రామికవేత్తలు, రైతులు, పశుపోషకులు.. అందరికీ, నేను మీకు పదే పదే హామీ ఇస్తున్నా. మీ ప్రయోజనాలు మోదీకి అత్యంత ముఖ్యమైనవి. ఎంత ఒత్తిడి వచ్చినా, తట్టుకునే శక్తిని మనం పెంచుకుంటూనే ఉంటాం” అని చెప్పారు.

కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదులు మన ప్రజల రక్తం కళ్లజూస్తే, డిల్లీలోని కూర్చొని ఆ పార్టీ ఏమీ చేయలేకపోయిందని ప్రధాని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం మాత్రం ఉగ్రవాదులను, వారి వెనుకున్న వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టదని స్పష్టం చేశారు.  “కాంగ్రెస్ తన హయాంలో ఉగ్రవాదులపై ఎలాంటి చర్య తీసుకోలేదు. ఉగ్రవాదులు మన ప్రజల రక్తాన్ని కళ్ల చూసినప్పటికీ, కాంగ్రెస్ ఢిల్లీలో కూర్చొని ఏమీ చేయలేకపోయింది. కానీ మా ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో పరిస్థితి పూర్తిగా మారింది” అని చెప్పారు. 

“మేము ఉగ్రవాదులను, వారి వెనుక శక్తులను ఎవ్వరినీ విడిచిపెట్టడం. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవడం ప్రపంచం మొత్తం చూసింది. కేవలం 22 నిమిషాల్లో ఉగ్రస్థావరాలను నాశనం చేశాం. ఆపరేషన్ సిందూర్ అనేది మన సైన్యం శౌర్యానికి చిహ్నంగా నిలిచింది” అని తెలిపారు. 

దేశాన్ని 60 నుంచి 65 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ, భారత్‌ను ఇతర దేశాలపై ఆధారపడేలా చేసి దిగుమతుల్లో కుంభకోణాలకు పాల్పడిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. నగరాల్లోని పేదలకు గౌరవప్రదమైన జీవన పరిస్థితులను అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని పేర్కొన్నారు. “కేంద్రంలోని మా ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనలో భారతదేశంలోని 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసింది” అని ప్రధాని మోదీ తెలిపారు.