నకిలీ ఎన్ఆర్ఐ పత్రాలతో 18 వేల ఎంబీబీఎస్ అడ్మిషన్లు

నకిలీ ఎన్ఆర్ఐ పత్రాలతో 18 వేల ఎంబీబీఎస్ అడ్మిషన్లు

ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి మెడికల్ కాలేజీల్లో ఉండే ఎన్ఆర్ఐ కోటా కోసం నకిలీ పత్రాలు సమర్పించి వేల సంఖ్యలో విద్యార్థులు సీట్లు పొందారని తేలింది. ఈ కుంభకోణానికి సంబంధించిన భారీ రాకెట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా బట్టబయలు చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయం సహాయంతో జరిపిన ఈడీ నిర్వహించిన దర్యాప్తులో 18 వేల మంది విద్యార్థులు నకిలీ ఎన్‌ఆర్ఐ పత్రాలను ఉపయోగించి ఎంబీబీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందినట్లు వెలుగులోకి రావడం పెను దుమారం రేపుతోంది. 

ఈ నేపథ్యంలోనే ఓ కాలేజీకి చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను స్వాధీనం చేసుకున్న ఈడీ మొత్తంగా రూ.12.33 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.  నకిలీ సర్టిఫికెట్లకు సంబంధించిన ముఠాలో కొన్ని మెడికల్ కాలేజీలు, కొందరు ఏజెంట్లు కలిసి పని చేస్తున్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఆయా కొందరు ఏజెంట్లకు మెడికల్ కాలేజీలు డబ్బులు చెల్లించి, వారి నుంచి ఎన్ఆర్ఐలకు చెందిన రాయబార కార్యాలయాల పత్రాలు, వారి కుటుంబాలకు చెందిన నకిలీ సర్టిఫికెట్స్‌ను తయారు చేయిస్తున్నచట్లు తేలింది.

చాలా సందర్భాల్లో ఏజెంట్లు, మెడికల్ కాలేజీలు ఒకే రకమైన నకిలీ సర్టిఫికెట్లను అనేక మంది విద్యార్థుల అడ్మిషన్ల కోసం ఉపయోగించినట్లు దర్యాప్తులో బయటికి వచ్చింది. అయితే ఈ నకిలీ ఎన్‌ఆర్ఐ సర్టిఫికెట్ల ముఠాలో కొందరు నిజమైన ఎన్ఆర్ఐ అభ్యర్థులు కూడా ఉన్నారని తేలింది. ఎన్ఆర్ఐల పేర్లను ఉపయోగించుకునేందుకు పలువురు ఏజెంట్లు వారికి డబ్బులు ఇచ్చినట్లు వెల్లడైంది.

మెడికల్ సీట్లకు సంబంధించిన కోటా నిబంధనల ప్రకారం ఎన్ఆర్ఐ కోటాలో అడ్మిషన్లు పొందే విద్యార్థుల ఫీజులను ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు లేదా వారి బంధువులు చెల్లించాల్సి ఉంటుంది.  కానీ తాజాగా నిర్వహించిన ఈడీ దర్యాప్తులో చాలా కేసుల్లో కాలేజీ ఫీజులను ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు చెల్లించలేదని వెల్లడైంది.  ఈ క్రమంలోనే ఈ ఆరోపణలు వెలుగులోకి రాగానే రంగంలోకి దిగిన ఈడీ అధికారులు కొన్ని కాలేజీలపై దాడులు చేసి పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది.

ఈ తనిఖీల్లో భారీగా నకిలీ ఎన్ఆర్ఐ సర్టిఫికెట్లు, అమెరికాలోని నోటరీ అధికారుల నకిలీ స్టాంపులు దొరికాయి.  ఈ మెడికల్ సీట్ల అక్రమాలపై పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గత నెలలోనే ఈడీ అధికారులు ఆరోపించగా,  తాజాగా ఈ వ్యవహారం బయటికి రావడం పెను సంచలనంగా మారింది.  ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీకి చెందిన రూ. 6.42 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను ఈడీ అధికారులు తాత్కాలికంగా జప్తు చేసుకున్నారు.

అయితే గతంలో కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడిన కొన్ని కాలేజీలు, వ్యక్తులకు చెందిన రూ.12.33 కోట్ల ఆస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. తాజాగా ఈడీ అధికారులు నిర్వహిస్తున్న దర్యాప్తు ద్వారా దేశవ్యాప్తంగా మెడికల్ అడ్మిషన్లలో జరుగుతున్న భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చినట్లయింది.