“విద్యుత్ వాహనాల్లో బ్యాటరీ తయారీ ముఖ్యమైన అంశమని మనందరికీ తెలుసు. కొన్నేళ్ల క్రితం వరకు బ్యాటరీలను దిగుమతి చేసుకున్నాం. విద్యుత్ వాహనాల తయారీని బలోపేతం చేయడానికి భారత్‌లోని బ్యాటరీలను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే 2017లో టీడీఎస్జీ బ్యాటరీ యూనిట్‌కు శంకుస్థాపన చేశాం” అని ప్రధాని చెప్పారు.
“భారత్‌కు ప్రజాస్వామ్య శక్తితో పాటు జనాభా అనుకూలత ఉంది. అధిక సంఖ్యలో నైపుణ్యంతో కూడిన మానవవనరులు అందుబాటులో ఉన్నారు. భారత్‌లో పెట్టుబడి పెడితే భాగసామ్యం అయిన ప్రతిఒక్కరికీ లాభదాయకమే” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యావత్ ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని, ఈ సమయంలో ఏ రాష్ట్రం వెనుకబడి ఉండకూదని ప్రధాని స్పష్టం చేశారు. ప్రతి రాష్ట్రం అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కృషి చేయాలని సూచించారు.
మన దేశానికి వచ్చే ఇన్వెస్టర్లు ఏ రాష్ట్రానికి వెళ్లాలో అర్థం కాక అయోమయం కావాలని, ఇందుకోసం అభివృద్ధి ఆధారిత, సుపరిపాలన విధానాలను రూపొందించేందుకు అన్ని రాష్ట్రాలు పోటీపడాలని ప్రధాని కోరారు. “జపాన్‌కు చెందిన సుజుకీ సంస్థ భారత్‌లో తయారీ చేస్తుంది. ఇక్కడ తయారీ చేసిన కార్లను జపాన్‌కు తిరిగి ఎగుమతి చేస్తున్నాం. ఇది కేవలం భారత్- జపాన్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచానికి భారత్‌పై ఉన్న నమ్మకాన్ని ప్రదర్శిస్తోంది. మారుతీ సుజుకీ లాంటి సంస్థలు మేకిన్ ఇండియాకు ప్రచారకర్తలు. ఇక్కడ రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలు మేడిన్ ఇండియా అని రాసి అనేక దేశాలకు ఎగుమతి అవుతాయి” అని ప్రధాని వివరించారు.
అంతకుముందు మారుతి సుజుకీ సంస్థకు చెందిన తొలి ఎలక్ట్రిక్ వాహనం ఈ-విటారాను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సుజుకీ, తొషిబా, దెన్షో సంస్థలు సంయుక్తంగా నిర్మించిన లిథియం అయాన్ బ్యాటరీ తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం హన్సల్పుర్లో ఉన్న మారుతి సుజుకీ కార్ల తయారీ యూనిట్లో మోదీ కలియతిరిగారు. ఈ-విటారాకు సంబంధించిన విశేషాలతో పాటు ప్లాంట్‌లో ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతికతను కంపెనీ ప్రతినిధులు మోదీకి వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్‌తో పాటు మంత్రులు పాల్గొన్నారు. దేశీయంగా రూపొందించిన ఈ-విటారాను జపాన్ సహా 100కుపైగా దేశాలకు ఎగుమతి చేస్తామని మారుతి సుజుకీ కంపెనీ తెలిపింది. ఐరోపాలో జరిగిన ప్రదర్శనలో మారుతి సుజుకీ సంస్థ తొలిసారి ఈ-విటారాను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ-విటారా రెండు బ్యాటరీ వేరియంట్లతో మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.

More Stories
సమాజం ఆర్ఎస్ఎస్ ను ఆమోదించింది.. వ్యక్తులు నిషేధింపలేరు
జూబ్లీ హిల్స్ లో బిజెపి ప్రయత్నాలు ముమ్మరం చేయాలి
మతమార్పిడులు, ఫాస్టర్లను అడ్డుకోవడం `రాజ్యాంగ వ్యతిరేకం కాదు’