ఆప్ నేత సౌర‌భ్ భ‌ర‌ద్వాజ్ ఇంట్లో ఈడీ త‌నిఖీలు

ఆప్ నేత సౌర‌భ్ భ‌ర‌ద్వాజ్ ఇంట్లో ఈడీ త‌నిఖీలు
మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ మాజీ ఆరోగ్యమంత్రి, ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ సహా ఇతరుల నివాసాలపై సోదాలు కొనసాగుతున్నాయని ఇడి వర్గాలు మంగళవారం తెలిపాయి. దేశ రాజధాని అంతటా 13 ప్రాంతాల్లో  ప్రస్తుతం సోదాలు చేపడుతున్నారని  ఓఈజిన్నారు. ఢిల్లీలోని మునుపటి ఆప్‌ ప్రభుత్వం ఆరోగ్య మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించిన అవినీతి కేసుకు సంబంధించి ఈ చర్యలు తీసుకున్నట్లు ఈడి తెలిపింది.

హాస్పిట‌ల్ నిర్మాణ స్కామ్ సుమారు 5,590 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 2018-2019 మ‌ధ్య కాలంలో ఆమ్ ఆద్మీ ప్ర‌భుత్వం 5590 కోట్ల‌తో సుమారు 24 ఆస్ప‌త్రుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఐసీయూ ఆస్ప‌త్రుల‌ను ఆరు నెల‌ల్లోగా పూర్తి చేయాల‌ని నిర్దేశించారు. కానీ మూడేళ్ల త‌ర్వాత కూడా ప‌నులు పూర్తి కాలేదు.  ప్రధాని విద్యా అర్హత వివాదంపై నుండి దృష్టిని మళ్లించేందుకు ఈడి సోదాలు చేపడుతోందని ఢిల్లీ మాజీ విద్యామంత్రి, సీనియర్‌ ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా మండిపడ్డారు. 

”నిన్న .. దేశం మొత్తం మోడీ డిగ్రీ గురించి ప్రశ్నలు లేవనెత్తింది. డిగ్రీ గురించి వాస్తవం బయటకు వచ్చినపుడు, దృష్టిని మళ్లించడానికి, ఈరోజు సౌరభ్‌భరద్వాజ్‌పై ఈడి దాడులు జరుగుతున్నాయన్న ప్రశ్న స్పష్టంగా ఉంది. మోడీ డిగ్రీ నకిలీదా కానీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం లేదు. అందుకే ఆప్‌ నేతలపై దాడులు ప్రారంభమయ్యాయి” అని సిసోడియా ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఈడి ఆరోపించిన స్కామ్‌ జరిగిన సమయంలో భరద్వాజ్‌ మంత్రి కూడా కాదని, దీని అర్థం వారి డిగ్రీ నకిలీ అయినట్లే, ఈ కేసులు కూడా నకిలీవే అని చెప్పారు. ఈ కేసులన్నీ నకిలీవి అనేందుకు ప్రత్యక్ష సాక్ష్యం మరో సీనియర్‌ ఆప్‌ నేత సత్యేందర్‌ జైన్‌పై కేసులని ఆగ్రహం వ్యక్తం చేశారు. ”సత్యేందర్‌ జైన్‌ను మూడేళ్ల పాటు జైలులో ఉంచారు. సిబిఐ, ఈడి పగలు రాత్రి శోధించాయి. కానీ ఎటువంటి ఆధారాలు గుర్తించలేకపోయాయి” అని గుర్తు చేశారు.