నలుగురు ఫిరాయింపు ఎమ్యెల్యేలకు అనర్హత తప్పదా!

నలుగురు ఫిరాయింపు ఎమ్యెల్యేలకు అనర్హత తప్పదా!
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో అసలు ఉప ఎన్నికలే రావు అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంభీర ప్రకటనలు చేసినా ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశంతో ఈ విషయమై పరిశీలన చేపట్టడంతో 10 మందిలో కనీసం కాపాడటం సాధ్యం కానీ నలుగురు ఎమ్యెల్యేలను వదిలించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిరాయింపు ఎమ్యెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే ఉపఎన్నికలు వస్తున్నాయని భయపడుతున్న కాంగ్రెస్ ఇప్పుడు తప్పదనే నిర్ణయానికి వచ్చిన్నట్లు చెబుతున్నారు.

ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో సాంకేతికంగా దొరికిపోయిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసి, మిగతా ఎమ్మెల్యేలను కాపాడుకుందామని టీపీసీసీ కోర్‌ కమిటీ ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో శనివారం టీపీసీసీ కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, సీనియర్‌ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ఏఐసీసీ ప్రతినిధి తదితరులు సమావేశమయ్యారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపైనే కోర్‌ కమిటీ ప్రధానంగా చర్చించినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఉన్న ఫిర్యాదులను స్పీకర్‌ పరిశీలించారని, 10 మందిలో ఐదుగురికి నోటీసులు పంపారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ మొదట ప్రస్తావించినట్టు సమాచారం. అనంతరం ఈ అంశంపై వాడివేడిగా చర్చ సాగినట్టు తెలిసింది.

ఫిరాయింపుల అంశం పెద్ద సమస్యే కాదని, మరీ అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్‌రెడ్డి కొట్టివేసి ప్రయత్న్మ్ చేసినా  కోర్‌ కమిటీలోనే ఉన్న ఒక మంత్రి కల్పించుకొని, అంత తేలిగ్గా తీసుకోవద్దని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మీద అడ్వకేట్‌ జనరల్‌, సీనియర్‌ న్యాయవాదులతో కలిసి స్పీకర్‌ ఇప్పటికే న్యాయసమీక్ష నిర్వహించారని, వారి నుంచి సలహాలు సూచనలు స్వీరించిన తర్వాతే విచారణ ప్రక్రియ ప్రారంభించారని వివరించారట.

బీఆర్‌ఎస్‌ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలలో కొందరు పార్టీ మారినట్టు భౌతిక, సాంకేతిక ఆధారాలతో అడ్డంగా దొరికిపోయారని చర్చించుకున్నారట. అలాంటివారికి మనం ఎలాంటి సహాయం చేయలేమని ఒకరిద్దరు మంత్రులు స్పష్టం చేసినట్టు తెలిసింది. అలా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని, వారిని వదిలించుకోవటమే ఉత్తమమని, వారిని కాపాడే ప్రయత్నం చేస్తే మొత్తానికే ఎసరొచ్చే ప్రమాదం ఉన్నదని ఒక మంత్రి హెచ్చరికగా చెప్పినట్టు సమాచారం.

ఈ సందర్భంగా స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు సంబంధించిన రుజువులు ఉన్నట్టు కోర్‌కమిటీలో చర్చించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజ్యాంగాన్ని రక్షించాలంటూ రాహుల్‌గాంధీ రాజ్యాంగ ప్రతిని చేత పట్టుకొని దేశవ్యాప్తంగా తిరుగుతున్నారని, ఇలాంటి సమయంలో ఫిరాయింపులను దాచిపెట్టే ప్రయత్నం చేస్తే జాతీయస్థాయిలో పరువు పోతుందని ఒక నేత ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది.

పైగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయని, ఇప్పుడు వాటిని ధిక్కరిస్తే మరోసారి సుప్రీంకోర్టు నుంచి ఊహించని తీర్పు వస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పరువు పోతుందని హెచ్చరించారట. సాంకేతికంగా దొరికిపోయే ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాల్సి వస్తే ఆలోచించవద్దని కరాఖండిగా చెప్పినట్టు తెలిసింది.