రష్యా న్యూక్లియర్‌ ప్లాంట్‌పై యుక్రెయిన్ డ్రోన్‌ దాడి!

రష్యా న్యూక్లియర్‌ ప్లాంట్‌పై యుక్రెయిన్ డ్రోన్‌ దాడి!

రష్యా పశ్చిమ ప్రాంతంలోని కుర్స్క్‌లోని అణు విద్యుత్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులు చేసిందని మాస్కో ఆదివారం ఆరోపించింది. ఉక్రెయిన్‌ ఆదివారం 34వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోవడం విశేషం. రాత్రి సమయంలో అనేక ఇంధన, విద్యుత్‌ ప్లాంట్లపై దాడులు చేసినట్లుగా రష్యన్‌ అధికారులు పేర్కొన్నారు.  కుర్స్క్‌లోని ప్లాంట్‌లో మంటలు చెలరేగాయని, సకాలంలోనే మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు పేర్కొంది. ఈ దాడుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొంది.

డ్రోన్ దాడిలో ప్లాంట్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ దెబ్బతిందని,  రేడియేషన్ లెవల్స్‌ సాధారణంగానే ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ సంఘటన గురించి తమకు సమాచారం అందిందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తెలిపింది.  అణు స్థావరాల భద్రతను అన్ని విధాలుగా నిర్ధారించాలని ఏజెన్సీ చీఫ్ రాఫెల్ మరియానో గ్రాస్సీ పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఉక్రెయిన్ స్పందించలేదు. ఆదివారం రాత్రి నాటికి 95 ఉక్రెయిన్ డ్రోన్‌లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
రష్యా కూడా ఉక్రెయిన్‌పై 72 డ్రోన్‌లు, ఒక క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించింది.  వాటిలో 48 ఉక్రెయిన్ వైమానిక దళం నాశనం చేసింది.  రష్యాలోని లెనిన్‌గ్రాడ్ ప్రాంతంలోని ఉస్ట్-లుగా ఓడరేవులో మంటలు చెలరేగాయి. ఉక్రెయిన్ డ్రోన్ శకలాలు ఇక్కడి ఇంధన ఎగుమతి కేంద్రంపై పడడంతో మంటలు చెలరేగాయి. కీవ్‌లోని ఇండిపెండెన్స్ స్క్వేర్ నుంచి వీడియో సందేశంలో అధ్యక్షుడు జెలెన్స్కీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ  భద్రత, శాంతియుత జీవితం సాధ్యమయ్యే భవిష్యత్తును ఉక్రెయిన్ నిర్మిస్తోందని పేర్కొన్నారు. 
 
మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని జెలెన్స్కీ చెప్పారు. ఇటీవల జరిగిన అమెరికా-రష్యా అలాస్కా సమావేశాన్ని ప్రస్తావిస్తూ ప్రపంచం ఉక్రెయిన్‌ను గౌరవిస్తుందని, దానిని సమానంగా చూస్తుందని ఆయన చెప్పారు. కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ సైతం కీవ్‌కు చేరుకుని జెలెన్స్కీని కలిశారు. ఉక్రెయిన్‌కు నార్వే ఏడు బిలియన్ క్రోనర్ల (సుమారు 695 మిలియన్‌ డాలర్లు) కొత్త సైనిక సహాయాన్ని ప్రకటించింది. తూర్పు భాగంలోని డొనెట్స్క్ ప్రాంతంలోని రెండు గ్రామాలను తమ సైన్యం స్వాధీనం చేసుకుందని రష్యా పేర్కొంది.